ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు

ప్రధాన ప్రతిపక్షం వైసిపి సభ్యులు హాజరు కాకుండానే మరోసారి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. తమ పార్టీ నుంచి అధికార టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయనందుకు నిరసనగా గత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నుంచి వెఎస్సార్‌సీపీ సభ్యులు సభకు హాజరు కావడం లేదు. ఇప్పుడు కూడా పార్టీ ఫిరాయించిన 22 మంది శాసనసభ్యులపై తక్షణం వేటు వేస్తేనే శాసనసభకు హాజరవుతామని  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేసారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ చర్యలు తీసుకోనందున వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో రెండోసారి ప్రధాన ప్రతిపక్షం లేకండానే ప్రభుత్వం ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.

సమావేశాలకు హాజరవ్వాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీని కోరారు. దీనికి స్పందించిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ‘‘ప్రజాస్వామ్య దేవాలయాన్ని దెయ్యాల కొంపగా మార్చారు. 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. వారిలో నలుగురిని మంత్రులుగా నియమించారు. దీనిని ఏ ప్రమాణాల ప్రకారమైనా శాసనసభ అంటారా?’’ అని ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణమే వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఆ ఎమ్మెల్యేలపై వేటు వేసే వరకు సభకు హాజరవబోమని తేల్చి చెప్పారు.

కాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని.. జీతాలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు రోజు జరిగిన టిడిపి సమావేశంలో  విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడాన్ని దౌర్భాగ్యమైన చర్యగా అసెంబ్లీలో మంరి దేవినేని ఉమామహేశ్వరరావు  అభివర్ణించారు

మరోవంక, వయస్సులేదు...అనుభవం లేదు...ఆలోచన లేదు..ప్రజలకు మేలు చేయాలనే తపన లేదు..సలహాలు వినే నైజం లేదు..కేవలం నీ సహ నిందితుల సలహాలతోనే ముందుకు సాగాలన్న నీ అలోచన భరించలేకనే వైసిపిని  వీడామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

అధికారమే పరమావధిగా సాగుతున్న కుట్ర రాజకీయాలను ప్రత్యక్షంగా చూసి భరించలేక, రాష్ట్భ్రావృద్దిని కాంక్షిస్తూ పని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును బలపరిచామని ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్రాసిన బహిరంగ లేఖలో తెలిపారు. అంతర్గత సమావేశాల్లో జగన్ వ్యక్తపరిచిన దురభిప్రాయాలతో ఏకీభవించలేకనే పార్టీని వీడినట్లు పేర్కొన్నారు.