ఐదో దశలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రారంభమైన ఐదో దశ పోలింగ్‌ సందర్భంగా దేశంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ నియోజకవర్గ పరిధిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని రోహ్మూ పోలింగ్‌ కేంద్రంపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌ విసిరారు. 

ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. విధుల్లో భాగంగా అక్కడే ఉన్న భద్రతా బలగాలు ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే తొలి ఉగ్రవాదుల దాడి కావడం గమనార్హం. శాంతి భద్రతల దృష్ట్యా అత్యంత సున్నిత ప్రాంతమైన అనంత్‌నాగ్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మూడు, నాలుగు, ఐదు దశల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేటితో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. 

బిహార్‌లోని ఛాప్రా పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 131లో ఈవీఎంను ధ్వంసం చేసినందుకు రంజిత్‌ పాసవాన్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అలాగే పశ్చిమ బెంగాల్‌లోని బారక్‌పూర్‌ నియోజకవర్గ పరిధిలో బిజెపి, తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. తనపై టీఎంసీకి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు బారక్‌పూర్‌ బిజెపి అభ్యర్థి అర్జున్‌ సింగ్‌ పేర్కొన్నారు. కొంత మంది బీజేపీ కార్యకర్తలను ఓటు వేయకుండా అడ్డుకున్నారని.. దీనిపై ఎన్నికల అధికారులను సంప్రదించడానికి వెళ్లగా తనపై టీఎంసీకి చెందిన కొందరు వ్యక్తులు దాడికి దిగారని ఆయన ఆరోపించారు. 

ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. గత నాలుగు విడతల ఎన్నికల్లోనూ బెంగాల్‌లో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈసారి కేంద్ర సాయుధ బలగాలతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.

మరోవంక అమేథీలో తనను బిజెపికి కాకుండా పోలింగ్ సిబ్బంది బలవంతంగా కాంగ్రెస్ కు ఓట్ వేయించినట్లు ఒక వృద్ధురాలు చెప్పిన వీడియోను బిజెపి అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ వెల్లడించారు.