ఒడిషాను అన్ని విధాలా ఆదుకుంటాం.. : మోదీ

‘ఫణి’ తుపాను అల్లకల్లోలం సృష్టించిన ఒడిషా రాష్ట్రంలో  వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ  పర్యటించారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో ప్రధాని ఒడిషాకు చేరుకున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గవర్నర్ గణేషీ లాల్‌ లతో సమీక్ష చేశారు. 

ఈ సందర్భంగా ప్రధానికి అధికారులు తుపాను నష్టం గురించి నిశితంగా వివరించారు. మోదీ ఒడిషా పర్యటనలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా  పాల్గొన్నారు. తుఫాన్ నష్టం తగ్గించడంలో ముఖ్యమంత్రి విశేషంగా కృషి చేశారని ప్రధాని కొనియాడారు. నవీన్ బాబు అద్భుతంగా ప్రణాళికాయుతంగా వ్యవహరించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రజల పట్ల పూర్తి సంఘీభావం వ్యక్తం చేస్తూ తక్షణ సహాయమే కాకుండా పునర్నిర్మాణ కార్యక్రమాల్లో సహితం తాము అండగా ఉండమని హామీ ఇచ్చారు. 

ఏరియల్ సర్వే అనంతరం మీడియాతో మాట్లాడిన మోదీ.. ఒడిషాను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. ఒడిషాకు ఇప్పటికే రూ. 381 కోట్లు  సాయం అందిస్తున్నట్లు ప్రకటించామని.. తక్షణసాయంగా మరో వెయ్యి కోట్లిస్తామని మోదీ తెలిపారు. ‘ఫణి’ తుపాన్‌ను ఒడిషా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని ప్రధాని అభినందించారు. 

ఈ తుపాను భారీగా ఆస్తినష్టం.. పలు ప్రాంతాల్లో ప్రాణనష్టం కూడా వాటిల్లింది. అయితే ఆస్తి నష్టం వాటిల్లిందనేది ఇంత వరకూ అధికారులు అంచనా వేయలేకపోతున్నారు.  ఈ తుపాను థాటికి కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలకు తోడు... గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులతో వేల చెట్లు, కరెంటు స్తంభాలూ, సెల్‌ఫోన్ టవర్లు కుప్పకూలాయి. దీంతో ఒడిషా నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.