బిజెపికి మూడింట రెండొంతుల మెజార్టీ : రాజ్‌నాథ్‌

ఉత్తరప్రదేశ్‌లో నేడు ఐదో విడత పోలింగ్‌ సందర్భంగా కేంద్ర హోంమంత్రి, లఖ్‌నవూ బీజేపీ  అభ్యర్థి రాజ్‌నాథ్‌ సింగ్‌ తన కుటుంబ సభ్యులతో సహా పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికల్లో కూడా తానే అధిక మెజార్టీతో గెలవబోతున్నట్లు భరోసా వ్యక్తం చేశారు.  పైగా, బిజెపి ఈసారి మూడింట రెండొంతుల మెజార్టీని సొంతం చేసుకోనుందని ధీమా వ్యక్తం చేశారు. తిరిగి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టబోతున్నట్లు భరోసా వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా నేడు పోలింగ్‌ జరుగుతున్న స్థానాల్లో అందరూ తమ కుటుంబ సభ్యులతో సహా ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. 2014 ఎన్నికల్లో లఖ్‌నవూ నుంచి పోటీచేసిన ఆయన రెండు లక్షలకు పైగా మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే.

మొన్న బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన శతృఘ్న సిన్హా సతీమణి పూనమ్‌ సిన్హా ఇదే స్థానంలో ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్‌డీ కూటమిలో కాంగ్రెస్‌ లేకపోయినా ఆ పార్టీ నాయకుడు శతృఘ్న..భార్య పూనమ్‌ కోసం అనేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆధ్యాత్మిక గురువు ఆచార్య ప్రమోద్‌ కృష్ణన్‌ బరిలో నిలిచారు. 

మొత్తం ఏడు విడతల సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 51 లోక్‌సభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మే 23న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇలా ఉండగా, సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి దశ పోలింగ్‌కి ముందు ఓటర్లకు సందేశమిస్తూ ఉత్సాహపరుస్తున్న ప్రధాని మోదీ.. ఐదో విడత ఎన్నికలు సందర్భంగానూ ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతిసారీ యువ ఓటర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్న ఆయన ఈసారి కూడా రికార్డు స్థాయిలో వారిని ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు.

‘‘ఐదో దశ ఎన్నికల సందర్భంగా ఓటు వేయబోతున్న వారందరూ అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని కోరుతున్నాను. ప్రజాస్వామ్య బలోపేతంతో పాటు సుస్థిర దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావాలి’’ అని ట్విటర్‌ వేదికగా మోదీ వ్యాఖ్యానించారు. 

అలాగే కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైతం ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌ బూత్‌లకు తరలిరావాలని పిలుపునిచ్చారు.‘‘సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్‌లో భాగంగా ఈరోజు లఖ్‌నవూతో పాటు 51 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ప్రతి ఒక్కరూ పోలింగ్‌ బూత్‌లకు అధిక సంఖ్యలో తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొనాలని కోరుతున్నాను’’ అని రాజ్‌నాథ్‌ పిలుపునిచ్చారు