హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు

కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ నగరంలో ప్రవేశపెట్టారు. ఇతర మున్సిపాలిటీల్లో ఈ-స్వచ్ఛ్ ఆటోలను ప్రారంభిస్తామని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ వెల్లడించారు.  ఇంధనశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రాతో కలిసి సచివాలయం వద్ద ఐదు ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. నగరంలో కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిన్నట్లు అరవింద్ కుమార్ తెలిపారు.  

మొదటి విడుతలో 40 బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఐదు బస్సులను ప్రారంభించారు. ఇక నుంచి సాధారణ ప్రజలు ఎలాంటి శబ్ధంలేని, కాలుష్యరహిత బస్సుల్లో నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణం చేయవచ్చని చెప్పారు. మిగతా 35 బస్సులు అతిత్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఒలెక్ట్రా సంస్థతో ఆర్టీసీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 40 బస్సులను ప్రవేశపెడుతున్నారు. ఈ బస్సులను బీవైడీ, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఉత్పత్తి చేస్తున్నది. తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టినందుకు పురపాలకశాఖ, రవాణశాఖలను ఇంధనశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా అభినందించారు. ఒలెక్ట్రో గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఈడీ నాగ సత్యం మాట్లాడుతూ తాము తయారుచేసిన బస్సులు కాలుష్యం లేకుండా నడుస్తాయని చెప్పారు. దేశంలోని అనేక రాష్ర్టాల్లో విజయవంతమైన ఈ బస్సులను తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యం నడుపనున్నదని పేర్కొన్నారు.

జీరో ఎమిస్సన్ ఎలక్ట్రిక్ బస్ ఈ-బజ్ కే9 మోడల్‌గా పిలిచే ఈ బస్సులను ఒలెక్ట్రా బిడ్ సంస్థ మనదేశంలోనే తయారుచేసింది. 12 మీటర్ల పొడవైన ఈ ఏసీ లోయర్ ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సు లో డ్రైవర్‌తో సహా 40 మంది ప్రయాణం చేయవచ్చు. దాదాపు 4-5 గంటల్లోపు బస్సు బ్యాట రీ మొత్తం రీచార్జ్ చేయవచ్చు. లిథియం ఐయా న్ బ్యాటరీని బస్సులో అమర్చడం వల్ల ఒక్కసారి చార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్ల కంటే అదనంగా ప్రయాణిస్తుంది.

నీలింగ్ యంత్రాన్ని బస్సులో పొందుపర్చడం వల్ల వికలాంగులు, సీనియర్ సిటిజన్లు ఈ బస్సులోకి సులువుగా ఎక్కొచ్చు, దిగవచ్చు. ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఎయిర్ సస్పెన్షన్ ఉండటం వల్ల ఇందులో ప్రతిఒక్కరూ సౌకర్యంగా ప్రయాణించవచ్చు. షార్ట్ సర్క్యూట్, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, అగ్నిప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరుగకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తయారీ సంస్థ చెప్తున్నది.

కేంద్ర భారీ పరిశ్రమలశాఖ ఫేమ్-1 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా) పథకంలో భాగంగా ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు మీద రూ.కోటి సబ్సిడీని అందజేస్తున్నది.