కాశ్మీర్ లో రాజకీయ నేతల హత్యలపై విచారణ

జమ్మూకాశ్మీర్‌లో భారతీయ జనతా పార్టీ నాయకుడు గుల్ మహమ్మద్ మీర్ హత్యను ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో గత కొన్ని నెలల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు హత్యకు గురికావడంపై ఆయన విచారణకు ఆదేశించారు. భద్రతా సంస్థలు రాజకీయ పార్టీల కార్యకర్తలకు రక్షణ కల్పించడంలో ఏమయినా లోపాలు ఉన్నాయేమో కనుక్కోవాలని కూడా గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యంను ఆదేశించారని ఒక అధికార ప్రతినిధి తెలిపారు. 

బీజేపీ నాయకుడు మీర్ హత్యపై గవర్నర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మీర్ ఆత్మకు శాంతి చేకూరాలని, మీర్‌ను కోల్పోయి తీవ్రమయిన బాధలో ఉన్న అతని కుటుంబానికి భగవంతుడు తట్టుకునే శక్తిని ప్రసాదించాలని గవర్నర్ తన సంతాప సందేశంలో ప్రార్థించారు. శ్రీనగర్‌లోని గవర్నర్ సచివాలయం తెరుచుకున్న వెంటనే గవర్నర్ ఈ సంతాప సందేశాన్ని పంపించారని అధికార ప్రతినిధి వెల్లడించారు.

రాష్ట్రంలోని అందరు రాజకీయ నాయకులు, సర్పంచుల భద్రతను సమీక్షించడానికి గవర్నర్ ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని కూడా ఆదేశించినట్టు ఆయన వివరించారు. 

గవర్నర్ మాలిక్ ప్రభుత్వ సలహాదారు కె.విజయ్ కుమార్‌తో కూడా మాట్లాడారని, మీర్ హత్యకు పాల్పడిన హంతకులను త్వరగా అరెస్టు చేసేలా చూడాలని, ప్రజలలో భయోత్పాతాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఎవరినీ వదలిపెట్టవద్దని కూడా ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అందరు రాజకీయ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని గవర్నర్ ఆదేశించారని ఆయన వివరించారు.  

 

 

\