మోదీ గెలిస్తే భారత్‌ సూపర్‌ పవర్‌

 ప్రధాని నరేంద్ర మోదీకి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి అసలు పోలికే లేదని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా వ్యాస్పష్టం చేశారు. ఒకరికి (రాహుల్‌) కేవలం ఎన్నికలప్పుడే పేదలు గుర్తుకొస్తారని, కానీ మరో వ్యక్తి (మోదీ) మాత్రం పేదల జీవితాల్లో ఎలా మార్చాలని నిత్యం తపిస్తుంటారని చెప్పారు. మోదీని మరోమారు ప్రధానిని చేస్తే రానున్న ఐదేళ్లలో భారత్‌లో ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌గా ఎదుగుతుందని  భరోసా వ్యక్తం చేశారు. 

హరియాణాలోని సోనిపట్‌, పానిపట్‌, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌, చండీగఢ్‌ల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘గాంధీ- నెహ్రూ కుటుంబం దశాబ్దాలుగా అధికారం చెలాయించినా దేశంలో పేదరికాన్ని రూపుమాపలేకపోయింది. హుడా, చౌతాలా కుటుంబాల పాలనలో హరియాణాలో అవినీతి, అరాచకాలు రాజ్యమేలాయి' అని ధ్వజమెత్తారు. 

 అయితే బిజెపి ప్రభుత్వం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాక అవినీతి, అరాచకం తగ్గుముఖం పట్టి హరియాణా అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని అమిత్‌షా చెప్పారు. దేశభద్రతే తమకు అత్యంత ప్రధానాంశమని పానిపట్‌లో పునరుద్ఘాటించారు.

కాగా, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల దోషులను వదిలిపెట్టబోమని అమిత్‌షా స్పష్టం చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌లో బిజెపి అభ్యర్థి, బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవల్‌కు మద్దతుగా ప్రచారం చేస్తూ 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో వేల మంది సిక్కులను ఊచకోత కోసినా నేటికీ ఒక్కరికీ శిక్ష పడలేదని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం వచ్చాక బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని చెప్పారు. 

పుల్వామా ఘటన అనంతరం పంజాబ్‌ మంత్రి సిద్ధూ ఉగ్రవాదానికి దేశాలతో, మతాలతో సంబంధం లేదని వ్యాఖ్యానించడంపైనా అమిత్‌షా మండిపడ్డారు. సిద్ధూ భయ్యా.. మీకు పాక్‌పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపొండని హితవు చెప్పారు.