నరేంద్ర మోదీకే బికనేర్‌కు రైతుల మద్దతు

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మద్దతు పలుకుతామని రాజస్థాన్‌లోని బికనేర్‌కు చెందిన రైతులు స్పష్టం చేస్తున్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాల ద్వారా తమ జీవితాలకు కొంతవరకు లబ్ధిచేకూరినా లేక పోయినా రైతులు మోదీపట్ల మొగ్గుచూపుతుండటం గమనార్హం.

 బికనేర్ జిల్లా రాజస్థాన్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. సార్వత్రిక ఎన్నికల ఐదవ దఫా పోలింగ్ ఇక్కడ సోమవారం జరుగనుంది. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలతోబాటు, తీవ్రవాదంపై మోదీ అనుసరిస్తున్న దృక్పథం తమను ఆకట్టుకున్నట్టు ఈ సందర్భంగా రైతులు పేర్కొన్నారు. అసలు బీజేపీ అభ్యర్థి ఎవరనే విషయం తమకు అనవసరమని, రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ పనితీరునే పరిగణనలోకి తీసుకుని ఓటేస్తామని అనేకమంది రైతులు అంటున్నారు. 

ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకంతోబాటు, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర వంటివి ఇప్పటి వరకు తమ జీవితాలకు ఎలాంటి లబ్ధీ చేకూర్చలేదని నల్ గ్రామానికి చెందిన 56 ఏళ్ల జండూ రామ్ అనే రైతు పేర్కొన్నారు. చెనగలను తక్కువ ధరలకే అమ్ముకున్న పరిస్థితిని వివరిస్తూ తమ ప్రాంతంలోని రైతులకు ప్రభుత్వ పథకాలపై సరైన అవగాహన కూడా ఉండదని ఆయన చెప్పారు. ‘మేము ప్రభుత్వం కల్పిస్తున్న కనీస మద్దతు ధరను పొందాలంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మా పంటలను విక్రయించాలి. అలాచేస్తే నాలుగు నెలల పాటు డబ్బుకోసం వేచివుండాల్సి వస్తుంద’ని ఆయన వెల్లడించారు.

క్వింటాల్ చెనగ పప్పునకు మద్దతు ధర రూ. 4,600 (అధికారిక ధర 4,620) ఉంది. కానీ రైతులు రూ.4,300కే మార్కెట్లో శెనగలు విక్రయించుకుంటున్నారని, అందువల్ల ఈ స్కీంలు నిష్ప్రయోజనమని ఆయన చెప్పారు. ఎన్నివున్నా ప్రస్తుతానికి ప్రధాన మంత్రి పదవికి మొదీని మించిన యోగ్యులెవరూ లేరని ఆ రైతు పేర్కొనడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేనివిధంగా మోదీ దేశానికి చెందిన సొమ్మును విదేశాలకు తరలకుండా కట్టడి చేశారు.

 కాంగ్రెస్‌లా మనదేశ సంపదను ఇతరులు దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోలేదని, దేశానికి అపారమైన ఖ్యాతిని తీసుకురావడమే కాదు, మన జవాన్లను 40 మందిని పొట్టనబెట్టుకున్న 350 మందిని పాకిస్తాన్‌లోకే వెళ్లి హతమార్చి ఆ దేశానికి మోదీ తన సత్తాచాటారని ఆ రైతు గుర్తు చేశారు. రామ్ సోదరుడు 65 ఏళ్ల బిన్విజీ మాట్లాడుతూ రైతులకు ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఏమీ చేయకపోయినా దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల సమస్య తీవ్రతను మోదీ తగ్గించారని పేర్కొన్నారు. 

కాగా ఇక్కడ గత రెండు దఫాలుగా గెలుస్తున్న బీజేపీ ఎంపీ అర్జున్ రామ్ మేఘవాల్ పట్ల అత్యధిక శాతం రైతులు మొగ్గు చూపడం విశేషం.