నెల్లూరు ఆసుపత్రిలో అవయవాల మాఫియా.... నోరుమెదపని ప్రభుత్వం!

ఆసుపత్రులకు రోగులుగా వచ్చిన పేద ప్రజలను `బ్రెయిన్ డెడ్' అని ప్రకటించి వారి శరీరంలోని అవయవాలను చెన్నైకి తరలించి భారీ వ్యాపారం చేయడం కార్పొరేట్ ఆసుపత్రులకు పరిపాటిగా మారింది. చెన్నయికి దగ్గరగా ఉండే నెల్లూరు వంటి పట్టణాలలో కార్పొరేట్ ఆసుపత్రులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు చాలాకాలంగా ఆరోపణలు వెలువడుతున్న, తాజాగా ఒక ఆసుపత్రిలో వెల్లడి అయింది.

అయితే ప్రధాన రాజకీయ పక్షాలు గాని, ప్రభుత్వంలోని పెద్దలు గాని ఈ విషయమై నోరు మెదపక పోవడం గమనార్హం. ఆ ఆసుపత్రి అధిపతి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోని ఒక కీలక మంత్రికి సమీప బంధువు కావడంతో పాటు, అన్ని రాజకీయ పార్టీల నేతలతో `సన్నిహిత' సంబంధాలు ఉండటమే కారణంగా తెలుస్తున్నది. ఈ విషయమై తాను కూడా మీడియాలో చూశానని, వివరాలు తెలుసుకుంటానకి అంటూ చంద్రబాబు దాటవేత ధోరణి కనబరిచారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అయితే ఆసుపత్రిపై ప్రభుత్వ పరంగా చర్య తీసుకోవడాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు.

అవయవాల దానానికి ప్రోత్సహిస్తున్నట్లు చెబుతూ భారీ వ్యాపారం చేయడం వెలుగులోకి వచ్చింది. సింహపురి ఆస్పత్రిలో ఒక కిడ్నీ దానంపై వివాదం జరుగుతోంది. ఇక్కడ నుంచి చెన్నరు నగరానికి వెళుతున్న గుండె, కిడ్నీ, లివర్‌, లంగ్స్‌ పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. చెన్నరు కేంద్రంగా కార్పొరేట్‌ ఆస్పత్రుల మాఫియా వ్యవహారం బయటకొస్తోంది. ఇందుకోసం పెద్ద నెట్‌వర్క్‌ నడుస్తున్నట్లు తెలుస్తున్నది. అవయవదానం ఒక సామాజిక అంశం. కేవలం పేదలు మాత్రమే దానం చేస్తున్నారు. డబ్బున్నవారు వాటిని పొందుతున్నారు. 

నెల్లూరు సింహపురి ఆస్పత్రిలో జరిగిన అక్రమ అవయవదానం కుంభకోణం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనమైంది. జిల్లాలో ఇటీవల 39 మందికి అవయవదానం చేశారు. ఇందులో 90 శాతం చెన్నయి నగరానికే తీసుకెళ్లారు. అందులో దాతలంతా పేద, మధ్య తరగతి వారే కావడం గమనార్హం. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి వచ్చిన వారిని బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతోన్న ఈ వ్యవహారం సింహపురి ఆస్పత్రిలో జరిగిన సంఘటనతో బయటకొచ్చింది.

నిరుపేద గిరిజనుడైన ఎ. శీనయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరడం, బ్రెయిన్‌ డెడ్‌ పేరుతో ఆయన అవయవాలు తీసుకున్నారు. నిరుపేద కుటుంబానికి రూ.1.28 లక్షలు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. అంత మొత్తం కట్టలేకపోతే అవయవదానం చేయాలని డాక్టర్లు పట్టుబట్టారు. దాంతో ఆ కుటుంబం ఒప్పుకున్న విషయం తెలిసిందే. శీనయ్య గుండెను చెన్నయిలోని గ్లోబల్‌ ఆస్పత్రికి, ఒక కిడ్నీ కిమ్స్‌కు, మరో కిడ్నీ సింహపురి ఆసుపత్రికి, రెండు కళ్లు మోడరన్‌ కంటి వైద్యశాలకు తరలించారు.

అవయవదానానికి సంబంధించి చెన్నయ్‌ కేంద్రంగా మాఫియా నడుస్తున్నట్లు అనుమానాలున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి అత్యధిక భాగం అక్కడికే వెళుతున్నాయి. చెన్నయ్‌లోని 15 కార్పొరేట్‌ ఆస్పత్రులకు ఇందులో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి పంపుతున్న అవయవాలకు భారీస్థాయిలో స్థానిక ఆస్పత్రులకు డబ్బు ముట్టజెపుతున్నట్లు చెబుతున్నారు. అవయవదానం ఉచితమని చెబుతున్నా ఆపరేషన్లు పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నారు. లివర్‌ అమర్చడానికి సుమారు రూ.30 నుంచి రూ.35 లక్షలు. గుండె మార్పిడికి రూ.25 లక్షలు, లంగ్స్‌కు రూ.15 లక్షలు, కిడ్నీలు రూ.6 లక్షలు, చొప్పున చెన్నయిలో ఆసుపత్రులు ఫీజులు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ఒక క్రమపద్ధతిలో రోగులకు అమర్చాల్సి ఉండగా డబ్బున్నవారికి అడ్డదారిలో తీసుకెళుతున్నట్లు చెబుతున్నారు. ఏదొక సాకు చూపించి ముందున్నవారిని పక్కన పెట్టి భారీగా డబ్బు ఖర్చుపెట్టగలవారికే అవయవాలు అమర్చుతున్నారు. చెన్నయి నెల్లూరు 180 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో సకాలంలో పంపుతున్నామని చెబుతున్నారు. శరీరం నుంచి ఆర్గాన్‌ తీసిన తర్వాత ఎనిమిది గంటల్లో దానిని వినియోగించుకోవాల్సి ఉంది. చెన్నరులోని కార్పొరేట్‌ ఆస్పత్రులు ఇందుకోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి.

నెలకు కనీసం మూడు ఆపరేషన్లు చేసినా రూ.కోటి బిల్లులు వస్తాయి. అందుకే పెద్ద ఎత్తున అవయవదానంపై దృష్టిపెడుతున్నారు. అవయవాలు పంపిన ఆస్పత్రికి భారీగా కమీషన్లు ముట్టజెపు తున్నారు. జీవన్‌ ధాన్‌ ప్రాజెక్టులో కాసులకు కక్కుర్తిపడిన సింహపురి ఆస్పత్రిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో సింహపురి బ్రెయిన్‌ డెడ్‌ కేసులు ఎక్కువగా చేస్తోందనే విమర్శలున్నాయి. అవయవదానం కేసులు ఇక్కడ నుంచే ఉన్నాయి.