వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందంపై ట్రేడర్ల ఫైర్

అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాలు వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య కుదిరిన వాటాకొనుగోలు ఒప్పందంపై ట్రేడర్లు ఆందోళన బాటపట్టారు. ఈ నెల 15 నుంచి 90 రోజులపాటు దేశవ్యాప్తంగా ఆందోళన చేయనున్నట్లు ట్రేడర్స్ అసోసియేషన్ సియట్ ప్రకటించింది. వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందంతోపాటు రిటైల్ రంగంలోకి ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితులను పెంచినందుకుగాను ఈ నెల 28న భారత్ ట్రేడ్ బంధ్‌కు కూడా పిలుపునిచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు ప్రకటించాయి.

దేశీయ సంస్థయైన ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను కొనుగోలు చేయడానికి వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్ల నిధులను వెచ్చించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అంతకుముందు సియట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖందేల్‌వాల్ మాట్లాడుతూ గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ-కామర్స్ సంస్థల అగచాట్లు తీవ్రస్థాయికి చేరుకున్నాయని, ముఖ్యంగా ధరల విషయంలో అక్రమాలకు పాల్పడుతూ రాయితీల యుద్ధానికి తెరలేపుతున్నాయని విమర్శించారు. ఇప్పటికీ భారత్‌లో ఈ-కామర్స్ సంస్థలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడం విడ్డురంగా ఉన్నదని అన్నారు.