కాంగ్రెస్ ప్రతిష్టను దిగజారుస్తున్న రాహుల్

ప్రధాని మోదీపై విమర్శలు చేసే క్రమంలో రాహుల్‌ గాంధీ తన సొంత పార్టీ కాంగ్రెస్‌ ప్రతిష్ఠను దిగజార్చుకుంటున్నారని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ధ్వజమెత్తారు. ఇటీవల రాహుల్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ..‘మోదీ విధానాలను ఎండగట్టి ఆయన ప్రతిష్ఠను విచ్ఛిన్నం చేశాను’ అని అనడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు మోదీ అని.. అలాంటి వ్యక్తి ప్రతిష్ఠకు ఎలా భంగం కలిగించగలరని ప్రశ్నించారు. 

‘‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి మరో వ్యక్తి ప్రతిష్ఠకు ఎలా భంగం కలిగించగలరు. అసలు ఆయన(రాహుల్‌) ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆయనకు మాట్లాడటం తప్ప వినడం తెలియదు. ఎలాగైనా మోదీపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న ఆయన ఆలోచన తిరిగి వారి పార్టీకే నష్టం కలగజేస్తోంది’’ అని జైట్లీ విమర్శించారు.

రఫేల్‌ ఒప్పందంపై రాహుల్‌ చేసిన ఆరోపణలన్నీ అసత్యాలే అని, పైగా వాటి వల్ల మోదీ ప్రతిష్ఠ దిగజారిందని వారు భ్రమపడుతున్నారన్నారని జైట్లీ ఎద్దేవా చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రాఫెల్ ఒప్పందంపైనా, ప్రధాని మోదీపైనా రాహుల్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అటు కాగ్, ఇటు సుప్రీం కోర్టు ఆమోదించిన ఒప్పందాన్ని రాహుల్ తప్పుపట్టడం విచిత్రంగా ఉందన్నారు. ఈ కాంట్రాక్టుతో ఎలాంటి సంబంధం లేని మోదీపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.

 పదవులను వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులుగా రాహుల్‌ కుటుంబం భావిస్తోందని దుయ్యబట్టారు.  మోదీ గొప్ప మాటకారి అన్న రాహుల్‌.. పరోక్షంగా తన నైపుణ్యాల మీద తనకున్న అపనమ్మకాన్ని బయటపెట్టుకున్నారని ధ్వజమెత్తారు. 2014లో ఒక సాధారణ వ్యక్తి అఖండ విజయం సాధించి ప్రధాని పదవి చేపట్టడాన్ని అంగీకరించలేకపోతున్న కాంగ్రెస్‌.. అసూయతో రగిలిపోతుందని విమర్శించారు.