‘రాఫెల్‌’పై వచ్చేవారం సుప్రీం విచారణ

ఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని వచ్చే వారం సుప్రీంకోర్టు విచారించనుంది. ఈమేరకు న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ, తాను దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అత్యవసర విచారణకు స్వీకరించాల్సిందిగా చేసిన విజ్ఞప్తిని - ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం పరిగణలోకి తీసుకుంటూ అంగీకారం తెలిపింది.

ఫ్రాన్స్‌తో జరిగిన రాఫెల్‌ ఒప్పందంలో తేడాలున్నందున స్టే ఇవ్వాల్సిందిగా శర్మ తన వ్యాజ్యంలో కోరారు. 36 యుద్ధ విమానాల కొనుగోలుకు రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఇందులో అవినీతి చోటు చేసుకోవడంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 253 ప్రకారం పార్లమెంటు ఆమోదించనందువల్ల దీన్ని రద్దు చేయాలని శర్మ వ్యాజ్యంలో కోరారు.

ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణశాఖ మాజీ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌, వ్యాపారవేత్త అనిల్‌ అంబానీతో పాటు, ఫ్రెంచి కంపెనీ డసాల్ట్‌పై కేసు నమోదు చేయాలని, సొమ్మును తిరిగి రాబట్టాలని వ్యాజ్యంలో విజ్ఞప్తి చేశారు.

కాగా రాఫెల్‌ ఒప్పందంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఈ ఏడాది మార్చిలో కూడా ఇలాంటిదే వ్యాజ్యం దాఖలైంది. కాంగ్రెస్‌ నేత తెహ్‌సీన్‌ ఎస్‌. పోనావాల్లా దాఖలు చేసిన నాటి వ్యాజ్యంలో ఈ ఒప్పందం ఎంత మొత్తానికి జరిగిందో పార్లమెంటు ముందు వెల్లడించేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టును కోరారు. అలాగే రాఫెల్‌ ఒప్పందంపై సంతకం చేసేముందు కేంద్ర కేబినెట్‌ ఆమోదం ఎందుకు తీసుకోలేదో తెలపాలంటూ కేంద్రానికి ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.