కాంగ్రెస్ లక్షితదాడులు అన్ని పేపర్ దాడులే !

 

యూపీఏ హయాం లో ఆరుసార్లు లక్షితదాడులు చేశామంటూ కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. సరిహద్దు దాటి సర్జికల్‌ స్ట్రెక్స్ చేసినట్టు ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ కాగితాలపై మాత్రమే సర్జికల్ స్ట్రెక్స్ చేసిందని ఎద్దేవా చేశారు.

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి (ఐరాస) అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్ని కాంగ్రెస్ విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలో ఆరుసార్లు లక్షిత దాడులు నిర్వహించామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  రాజస్థాన్‌లోని హిండౌన్ సిటీ, సికర్ పట్టణాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు.

"వారు మొదట లక్షిత దాడులను వ్యతిరేకించారు. మా ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణను చూసి ఇప్పుడు మేము కూడా చేశామంటూ కొత్తపాట అందుకున్నారు" అని దుయ్యబట్టారు. నాలుగు నెలల కిందట ఒక కాంగ్రెస్ నాయకుడు మూడుసార్లు లక్షితదాడులు చేశామని చెప్పారు. ఇప్పుడు మరో నాయకుడు ఆరుసార్లు అంటున్నారు. నాలుగు నెలల్లోనే దాడుల సంఖ్య రెట్టింపయ్యింది. ఎన్నికలు ముగిసేనాటికి 600కు చేరుతుందేమో అని ఎద్దేవాచేశారు.

వాళ్లు వీడియో గేమ్ ఆడుకుంటూ వాటినే సర్జికల్ ైస్ట్రెక్స్‌గా భావిస్తున్నట్టున్నారని ప్రధాని అవహేళన చేశారు. కాంగ్రెస్ నాయకులు ఆర్మీచీఫ్‌ను గూండా అని, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ను అబద్ధాల కోరు అంటూ అవమానించారని గుర్తుచేశారు. వారికి మన సైన్యం శౌర్యంపై నమ్మకం లేదని, అందుకే బాలాకోట్ దాడిలో చనిపోయిన ఉగ్రవాదుల లెక్కలు అడిగారని విమర్శించారు. రెండు పూటలా భోజనం దొరుకని వాళ్లే సైన్యంలో చేరుతారంటూ కర్ణాటక సీఎం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇప్పటికీ పెదవి విప్పలేదని, పరోక్షం గా మద్దతు పలుకుతున్నదని దుయ్యబట్టారు.

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి (ఐరాస) అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదని మోదీ ఆరోపించారు. దేశ భద్రత అంశంలో సాధించిన విజయానికి సంబురపడాల్సింది పోయి ఎన్నికల సమయంలో ఉగ్రవాదిగా ప్రకటిస్తారా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నదని మండిపడ్డారు. ప్రకటించేముందు కాంగ్రెస్ నుంచి అనుమతి తీసుకోవాలా? మేడమ్‌ను (సోనియాగాంధీని).. నామ్‌దార్‌ను (రాహుల్ గాంధీని) అడుగాలా? అని ప్రశ్నించారు.

లక్షిత దాడులు, బాలాకోట్‌పై వైమానిక దాడి, మసూద్ అజర్‌పై ఉగ్రముద్ర.. ఇలా మూడుసార్లు ఉగ్రవాదంపై విజయం సాధించామని ప్రధాని గుర్తు చేశారు. 2008 నాటి పరిస్థితులను ఇప్పటితో పోల్చుకోవాలని ప్రజలకు సూచించారు. 2009, 2014 ఎన్నికల సమయంలో కేంద్రం భద్రతకు హామీ ఇవ్వకపోవడంతో ఐపీఎల్ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించారు. కానీ ఇప్పుడు ఎన్నికలతోపాటే ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా సజావుగా సాగుతున్నాయి అని గుర్తుచేశారు.

దేశం వివిధ రంగాల్లో ముందుకు సాగుతున్నా నెహ్రూ కుటుంబం ఇంకా దశాబ్దాల వెనుకే ఆగిపోయిందని ప్రధాని మోదీ ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ గురువారం రాయ్‌బరేలీలో పాములను ఆడించి జీవించే కుటుంబాలతో కాసేపు మాట్లాడటంతోపాటు స్వయంగా బుట్ట నుంచి ఓ పామును బయటకు తీసి కాసేపు చేతిలో పట్టుకున్నారు. భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఓ సందర్భంలో పాములు ఆడించేవాళ్ల ప్రదర్శనను తిలకించారు.

ప్రధాని మోదీ ఈ రెండు సందర్భాలను పోల్చుతూ.. నెహ్రూ పాముల ఆటను చూసి ఆనందించారు. ఇప్పుడు వారి నాలుగో తరం కూడా అదేపని చేస్తున్నారు. దేశం ఎంతో ముందుకు వెళ్లిందో గుర్తించలేకపోతున్నారు అని విమర్శించారు. ఇది పాములు పట్టే యుగం కాదని.. మౌస్ (కంప్యూటర్) పట్టే యుగమని గుర్తుచేశారు.