మోదీ, అమిత్ షా లకు ఈసీ క్లీన్ చిట్

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారన్న ప్రతిపక్షాల ఫిర్యాదుపై ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షులు అమిత్ షా లకు  ఎన్నికల సంఘం (ఇసి) క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ ఎన్నికలలో వారిద్దరూ  ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే విధంగా ఎలాంటి ప్రసంగాలు చేయలేదని పేర్కొంది.

'పాకిస్తాన్‌ బెదిరింపులకు దేశం భయపడే రోజులు పోయాయని, న్యూక్లియర్‌ బటన్‌ను దీపావళి కోసం దాచిపెట్టలేదని' రాజస్తాన్‌ సరిహద్దు పట్టణమైన బార్మార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో బార్మార్‌ రిటర్నింగ్‌ అధికారి పంపిన పది పేజీల మోడీ ప్రసంగాన్ని పూర్తిగా పరిశీలించామని, అవి ఎన్నికల కమిషన్‌ నిబంధనలను, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని ఇసి పేర్కొంది. 

కాగా, మోడీకి ఎన్నికల ప్రసంగాలకు సంబంధించి ఇసి క్లీన్‌ చిట్‌ ఇవ్వడం ఇది మూడవసారి కావడం గమనార్హం. సైనిక విజయాలను రాజకీయ లబ్థికి వినియోగించకూడదని ఆదేశాలిచ్చినా, మోడీ తన ప్రసంగాలలో అంతర్లీనంగా వాటిని ప్రచారం చేస్తూనే ఉన్నారని, ఆయనపై ప్రచారంలో పాల్గొనకూడదంటూ నిషేధం విధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.  

మరోవంక, బిజెపి  అధ్యక్షుడు అమిత్‌ పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రలో ఆయన చేసిన ప్రసంగాల్లో ఎక్కడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని ఈసీ  పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో షా ప్రసంగిస్తూ.. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై భారత వైమానిక దళం దాడి చేసిందని చెప్పారు. దానిపై పాకిస్థాన్‌లోను, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత కార్యాలయంలో మాత్రమే విషాదం నెలకొందని వ్యాఖ్యానించారు.  బాలాకోట్‌ దాడిపై పాకిస్థాన్‌లోను, కాంగ్రెస్‌లోను విషాదం నెలకొందని నాగ్‌పుర్‌ సభలో వ్యాఖ్యానించారు. వీటిపై కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేసింది.