తెలంగాణలోనే ఆ ఏడు మండలాల ఓటర్లు!

రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల ప్రజల ఓట్లు తెలంగాణ రాష్ట్ర జాబితాలోనే ఉన్నాయి. ముసాయిదా ఓటర్ల జాబితా రూపొందించే ప్రక్రియలో భాగంగా ఆ ఏడు మండలాల్లో ఇంటింటి సర్వేను తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయమే నిర్వహించింది. జాబితాలో కూడా వారిని తెలంగాణ ఓటర్లుగానే చూపింది.

 

పూర్వ ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు, భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం మినహా భద్రాచలం, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలు గోదావరి జిల్లాల్లో విలీనమయ్యాయి. రెవెన్యూ పరంగా విలీనమైనా ఎన్నికలసంఘం లెక్కల ప్రకారం తెలంగాణలోనే ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైనా నియోజకవర్గ పునర్విభజనను కేంద్రం నిర్వహించాల్సి ఉంది. అదింత వరకు చేపట్టలేదు. విలీనం చేయాలంటే కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేయాలి. తమ రాష్ట్ర ఓటర్ల జాబితాలో వారిని చేర్చాలని ఏపీ ప్రభుత్వం, అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం వేరువేరుగా కేంద్ర హోంశాఖకు ఇప్పటికే లేఖలు రాశాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నిరభ్యంతర లేఖలను జులైలో అందజేేశాయి. ఆ లేఖలు హోంశాఖ పరిశీలనలోనే ఉన్నాయి.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయమే ఆ 7మండలాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించింది. మద్యంతర లేదా సాధారణ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగిసేలోగా హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయని పక్షంలో అక్కడిఓటర్లు తెలంగాణలోనే ఓటేయాల్సి ఉంటుంది.