నాలుగు జిల్లాలకు ఎన్నికల కోడ్‌ మినహాయింపు

ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు జిల్లాల్లో కేంద్ర ఎన్నికల సంఘం కోడ్‌ను ఎన్నికల కమీషన్ సడలించింది. తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ మినహాయింపు ఇచ్చింది.ఫొని తుపాను నేపథ్యంలో సహాయక చర్యలు, పునరావాస చర్యలు ముమ్మరంగా సాగించేందుకు వీలుగా కోడ్‌ను సడలించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేసింది.

ఫొని తుపాను దృష్ట్యా సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు వీలుగా కోడ్‌ను సడలించాలని ఎన్నికల సంఘానికి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విన్నవించిన సంగతి తెలిసిందే.  దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం లేఖపంపారు. దీనిపై ఈసీ నాలుగు జిల్లాలకు మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

కోడ్‌ మినహాయింపు ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనే వివరాలు ఈసీ పేర్కొనలేదు. అయితే ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో ఓట్ల లెక్కింపు జరిగే మే 23 వరకు అమలులో ఉండగలదని భావిస్తున్నారు. ఇప్పటికే ఫొని తుపాను నేపథ్యంలో ఒడిశాలో కోడ్‌ను సడలించిన సంగతి తెలిసిందే.