దీక్ష విరమించిన బిజెపి నేత లక్ష్మణ్‌

హైదరాబాద్‌ నిమ్స్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ శుక్రవారం దీక్ష విరమింపజేశారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ లక్ష్మణ్‌ ఐదు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం క్షీణిస్తున్నందున పార్టీ కోర్‌ కమిటీ సూచన మేరకు లక్ష్మణ్‌ దీక్ష విరమించారు.

లక్ష్మణ్‌తో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడి దీక్ష విరమింపజేశారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు అండగా ఉంటామని అమిత్‌ షా హామీ ఇచ్చారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శిస్తామని భరోసా ఇచ్చారు. 119 నియోజకవర్గాల్లో దీక్షలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీజేపీ నేత మురళీధరరావు స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, హోంమంత్రిని కలుస్తామని చెప్పారు. 

హన్స్‌రాజ్‌తో పాటు బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, రామచంద్రరావు పాల్గొన్నారు. లక్ష్మణ్ ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా దీక్ష విరమించాలని కోరినట్లు హన్స్‌రాజ్‌ తెలిపారు. ఇంటర్ విద్యార్థులు ఇంత పెద్దఎత్తున ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొంటూ విద్యార్థులు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్రం తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన లక్ష్మణ్‌ను అదేరోజు అరెస్ట్‌ చేసిన పోలీసులు నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేస్తూ  ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి, ఇంటర్ బోర్డ్ కార్యదర్శిని వెంటనే తొలగించాలని, దీనిపై సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ చెయ్యాలని డిమాండ్‌ చేశారు.