కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేస్తున్న ప్రియాంక అనాలోచిత చర్యలు

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తుందనుకున్న ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తన అనాలోచిత ప్రకటనలతో పార్టీని ఇరకాటంలో పడవేస్తున్నారు. వివాదాస్పద ప్రకటనలతో మిత్రపక్షాలకు కాంగ్రెస్‌ను దూరం చేస్తున్నారు. మరోచోట బాధ్యతారహితంగా చిన్నపిల్లలతో ఎన్నికల నినాదాలు ఇప్పించడంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పింపజేయటం ద్వారా బీజేపీవారి విమర్శలకు గురికావలసి వస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయావకాశాల గురించి మాట్లాడుతూ, తమకు బలమున్నచోట మంచి అభ్యర్థులను రంగంలోకి దించి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాం.. విజయావకాశాలు లేనిచోట బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వటం ద్వారా బీజేపీ ఓట్లు చీల్చేందుకు గట్టిగా కృషి చేస్తున్నాం.. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు. ప్రియాంకా గాంధీ చేసిన ఈ ప్రకటన వివాదాస్పదమైంది.

ఈ ప్రకటనపై ఎస్పీ, బీఎస్పీ అధినాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి.. ఒకరికోసం మరొకరు పని చేస్తున్నారని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం కొనసాగుతోంది.. ఎస్పీ, బీఎస్పీ కూటమి ఓట్లు చీల్చేందుకు ప్రియాంకా గాంధీ పని చేస్తున్నారని బీఎస్పీ అధినాయకురాలు మాయావతి విమర్శించారు.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం ప్రియాంక ఈ ప్రకటనను పరోక్షంగా విమర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయటం వలన పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని వారు హెచ్చరిస్తున్నారు. పార్టీ అభ్యర్థులు ఓటమి పాలవుతున్నా గెలుస్తారని చెప్పాలే తప్ప ఇలా గెలవనిచోట బీజేపీ ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పటం ఆత్మహత్యాసదృశమే అవుతుందని వారంటున్నారు.

తాను చేసిన ప్రకటన పార్టీకి నష్టం కలిగిస్తోందని గ్రహించిన ప్రియాంక గురువారం రాయబరేలీలో విలేఖరులతో మాట్లాడుతూ తాను చచ్చినా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించనని ప్రకటించారు.

ఇదిలాఉంటే ప్రియాంక చిన్న పిల్లలతో కాంగ్రెస్ అనుకూల నినాదాలు ఇప్పించటంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ వ్యతిరేక నినాదాలు చేయించటం కూడా వివాదాస్పదమైంది. ఎన్నికల ప్రచారానికి చిన్నపిల్లలను ఉపయోగించుకోవటాన్ని ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో నిషేధించింది. చిన్నపిల్లలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రియాంక చిన్నపిల్లలతో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇప్పించటం, బీజేపీని తిట్టించటం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఢిల్లీ బీజేపీ విభాగం సీఈసీకి ఫిర్యాదు చేసింది. చిన్న పిల్లలతో ఎన్నికల నినాదాలు ఇప్పించిన ప్రియాంకా గాంధీపై తీవ్ర చర్యలు తీసుకోవాలని వారు ఢిల్లీ ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఇంకో వంక, దారిలో కనబడిన పాముల వద్ద ఆగి పాములతో ఆడుకొంటూ వాటిని గట్టిగా పట్టుకొని ఊపిరి పీల్చుకోకుండా చేసిన్నట్లు వన్యప్రాణుల పరిరక్షణ కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యారు.