పోలవరంలో ఉల్లంఘనల్లేవని కేంద్రం స్పష్టం

పోలవరం పనుల నిలిపివేత ఉత్తర్వులపై ఇచ్చిన ‘స్టే’ను రద్దు చేయాలని కోరుతూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్లోక్యూటరీ అప్లికేషన్‌ కొట్టేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ‘స్టే’ విధించడం ఇదే తొలిసారి కాదని, ఇదివరకు ఆరుసార్లు ఇలాంటి స్టే ఉత్తర్వులు జారీ అయ్యాయని గుర్తు చేసింది. ఒడిశా ప్రభుత్వానికి కౌంటరుగా సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్ర జల వనరులశాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

 ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని 2014 నుంచి ఇప్పటివరకూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలకు పలుమార్లు సూచించినా స్పందన లేదని కేంద్రం తెలిపింది. 1980 గోదావరి ట్రైబ్యునల్‌ ఇచ్చిన అవార్డుకు లోబడే పోలవరం నిర్మాణం జరుగుతోందని స్పష్టం చేసింది.

ఈ ప్రాజెక్టు షెడ్యూలంతా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేతుల్లోనే ఉంటుందని, 1980 ఏప్రిల్‌ రెండున రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంతోపాటు ఇతరత్రా అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే సీడబ్ల్యూసీ ముందుకెళ్తుందని హామీ ఇచ్చింది. స్పిల్‌ వే నీటి విడుదల సామర్థ్యాన్ని పెంచినంత మాత్రాన ప్రాజెక్టు డిజైన్‌లో ఎలాంటి మార్పూ ఉండదని పేర్కొన్నది.

ఇప్పుడున్న నిబంధనల ప్రకారం వందేళ్లకు ఒకసారి వచ్చే గరిష్ఠ వరదను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ మేం 500ఏళ్లకు ఒకసారి వచ్చేందుకు అవకాశమున్న 36లక్షల క్యూసెక్కులను పరిగణనలోకి తీసుకున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన గోపాలకృష్ణన్‌ కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణమంతా గోదావరి ట్రైబ్యునల్‌ ఆదేశాలకు లోబడే జరుగుతున్నట్లు నివేదిక ఇచ్చిన్నట్లు గుర్తు చేసింది.

ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో ముంపు తలెత్తకుండా అడ్డుకట్టలు నిర్మించుకోవడంగానీ, ఏపీ ఇచ్చే పరిహారాన్ని తీసుకోవడంగానీ ఇప్పటివరకూ చేయలేదు.  ఒడిశా వాదనల్లో పస లేనందున వారు దాఖలు చేసిన కేసును కొట్టేయాలని కేంద్రం సుప్రేం కోర్ట్ ను కోరింది.