ప్రశాంతంగా బీజేపీ తెలంగాణ బంద్ .. 6 వేల మంది అరెస్ట్

ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ గురువారం ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపుప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. బంద్ సందర్భంగా హైదరాబాద్‌లో రెండు వేల మంది పోలీసులు అరెస్టు చేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం ఆరు వేల మందికి పైగా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు.

మరోవైపు ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న లక్ష్మణ్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వైద్యులు హుటావుటిన హాజరై వైద్య చికిత్స అందిస్తున్నారు. బంద్‌లో భాగంగా బీజేపీ కార్యకర్తలు  ఉదయం సచివాలయం వద్ద బైఠాయించి పెద్ద ఎత్తుననిరసన తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని, ఇంటర్ బోర్డు వైఫల్యాలపై న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులను తొలగించాలని బీజేపీ నేతలు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర్‌రావు, సీనియర్ నేత, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీ మనోహర్ రెడ్డి, నగర మాజీ అధ్యక్షులు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ప్రధానకార్యదర్శి గౌతమరావును పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.

రాష్ట్రంలో నియంతృత్వం రాజ్యమేలుతోందని, అప్రజాస్వామిక విధానాల ద్వారా ప్రజా ఉద్యమాలను అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇవన్నీ సర్కారీ హత్యలేనని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు ఆదేశించే దాకా ఈ దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణకులైన అధికారులు, సంస్థలు, ప్రజాప్రతినిధులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించిన మహిళా మోర్చా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ సమీపంలో గురువారం దాదాపు 30 మందిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని వివిధ పోలీసు ఠాణాలకు తరలించారు. భాజపా మహిళా మోర్చా గ్రేటర్‌ అధ్యక్షురాలు బండారి రాధిక నేతృత్వంలో పలువురు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో గన్‌పార్కు నుంచి అసెంబ్లీ వైపు వెళుతుండగా.. సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి సిబ్బందితో వారిని అడ్డుకున్నారు. తిరిగి వారు అసెంబ్లీ వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశారు.

అంతకు ముందు నిమ్స్ ఆసుపత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 9.75 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేసే దాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఈప్రభుత్వ హత్యలపై పోరాటం చేస్తామన్నారు.

బీజేపీ ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైందని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము డిమాండ్‌ చేస్తుంటే... తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మాత్రం ‘ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి, బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి’ అంటూ ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసమని డి ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే 25 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారా? అని ప్రశ్నించారు.