జేసీ దివాకరరెడ్డికి ఈసీ షాక్

తరచూ వివాదాస్పద ప్రకటనలతో వార్తలలోకి ఎక్కే టిడిపి ఎంపీ జేసీ దివాకరరెడ్డికి ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికలలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట వలసి వచ్చినదని యధాలాపంగా అన్న మాట ఇప్పుడు ఆయనపై చర్యకు దారి తీస్తున్నది. 

కొద్దిరోజుల క్రితం ఈ ఎన్నికలకు కోట్లాది రూపాయిలు ఖర్చు చేయాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా వైసీపీ, సీపీఐ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు జేసీ ఎన్నికల కోడ్ ఉల్లఘించారని నిర్ధారణకు వచ్చారు.

టిడిపి తరఫున అనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, తాడిపత్రి శాసనసభ అభ్యర్థిగా బరిలో నిలిచిన జేసీ అస్మిత్‌రెడ్డిల గెలుపు కోసం ఎన్నికల్లో భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందంటూ  దివాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంఘించేలా ఉన్నాయని అనంతపురం జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ స్పష్టం చేశారు.

ఆయన వ్యాఖ్యలపై విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని తాడిపత్రి శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. జేసీ అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఎన్నికకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని జేసీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి.