జపాన్‌ నుండి 18 బుల్లెట్‌ రైళ్ళ కొనుగోలు

జపాన్‌ నుండి 18 బుల్లెట్‌ రైళ్ళను కొనుగోలు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. వీటి విలువ రు.7వేల కోట్లు. ఈ మేరకు కుదిరిన ఒప్పందంలో స్థానికంగా బుల్లెట్‌ రైలు తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం కూడా భాగంగా వుంది.

జపాన్‌ నుండి 18 బుల్లెట్‌ రైళ్ళు వస్తాయని, ప్రతి రైలుకు 10కోచ్‌లు వుంటాయని, గంటకు 350కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయని ఒక అధికారి చెప్పారు. ప్రపంచంలోకెల్లా జపాన్‌ బుల్లెట్‌ రైళ్లు అత్యంత భద్రత కలిగినవిగా పరిగణిస్తారని, దిగుమతి అయిన రైళ్ళలో ఆటోమేటిక్‌ రక్షణ వ్యవస్థలు వుంటాయని, అవి భద్రతకు హామీ కల్పిస్తాయని ఆయన తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ప్రాతిపదికన భారత్‌లో బుల్లెట్‌ రైలు విడిభాగాల కూర్పు కేంద్రాన్ని నెలకొల్పే దిశగా రైల్వేస్‌ కసరత్తు చేస్తున్నాయని తెలిపారు. భారత్‌లో మేక్‌ ఇన్‌ఇండియా కార్యక్రమం కింద అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పారు. కవాసాకి, హితాచి వంటి జపాన్‌ కంపెనీలు ఇక్కడ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.