కేరళ సీఎంకు మోదీ ఫోన్...అభయాస్తం

భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ ప్రజలను కేంద్రం ఆడుకొంతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. గురువారం నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి రోడ్లు, రైల్వే మార్గాలు కొట్టుకుపోతున్నాయి. ఆరు జిల్లాల్లో తీవ్ర విధ్వంసం నమోదైంది. ఇడుక్కిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ విలయంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇడుక్కి జిల్లావాసులే 11 మంది. ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో తీర ప్రాంతాలు అధికంగా దెబ్బతిన్నాయి. 

ప్రధాన జలాశయాలైన ఇడుక్కి, ఇడమళయార్ జలాశయాలు అత్యంత వేగంగా నిండిపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇడమళయార్ జలాశయం షట్టర్లను శుక్రవారం ఉదయం 5 గంటలకు తెరిచారు. ఈ నీరు ఎర్నాకుళం వరకు వెళ్ళింది, పెరియార్ నదిలో నీటి మట్టం పెరిగింది. సమీపంలోని అళువ పట్టణం జలమయమైంది. ఇడుక్కి జలాశయం గేట్లను 50 సెం.మీ. వరకు ఎత్తాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
 
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌‌కు గురువారం రాత్రి ఫోన్ చేశారు. సాధ్యమైనంత సహాయాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారు. ‘‘కేరళ సీఎం శ్రీ పినరయి విజయన్‌తో మాట్లాడాను. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉత్పన్నమైన పరిస్థితిపై చర్చించాను. ప్రభావిత ప్రాంతాలకు సాధ్యమైన రీతిలో, అన్ని రకాలుగా సహాయం అందజేస్తానని హామీ ఇచ్చాను. ఈ విపత్తు సమయంలో కేరళ ప్రజలతో భుజం భుజం కలిపి అండగా ఉన్నాం’’ అని మోదీ ట్వీట్ చేశారు.