క్యాడర్‌ను రక్షించుకోవడమే చంద్రబాబు వ్యూహమా!

ఈనెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇంతకు ముందుగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బూత్‌ లెవల్‌ సమీక్షలు నిర్వహించడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. ఇప్పటికే ఒక సారి పార్లమెంటరీ నియోజకవర్గాల వారి లోతైన సమీక్షను ఒక సారి జరిపిన ఆయన మరోసారి సుదీర్ఘ సమీక్షకు పూనుకోవడం అభద్రతా భావంతోనేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

పార్టీ అధిష్టానం అంచనా వేస్తున్నట్లు బొటాబొటి సీట్లతో అధికారంలోకి వస్తే సరే సరి! ఒక వేళ అంచనాలు తప్పి వైసిపి అధికారాన్ని హస్త గతం చేసుకుంటే పరిణామలు ఎలా ఉంటాయనే విషయంపై పార్టీలో అంతర్గత చర్చ ఇప్పటికే నడుస్తోంది. టిడిపి, వైసిపిి విజయావకాశాలపై జనసేన ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశంపై పార్టీలు అంచనాకు రాలేకపోతు న్నాయి. అంచనాలు తలకిందులై విపక్షపార్టీ అధికారంలోకి వస్తే కొందరు నేతలు కప్పదాట్లకు పాల్పడవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఈ పరిస్థితి ఎదురైతే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు ఈ సమీక్షలు దోహదపడతాయని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. వ్యూహాత్మకంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 50మంది ద్వితీయ శ్రేణి నేతలను సమీక్షలకు పార్టీ ఆహ్వానిస్తోంది. పోటీలో నిలబడిన అభ్యర్థులు ఎన్నికల్లో ఎలా వ్యవహరించారనే అభిప్రాయాన్ని క్షేత్ర స్థాయి నాయకుల నుంచి సేకరించనున్నారు. 

రాష్ట్ర స్థాయి టిడిపి సమీక్షలు మంగళగిరి సికె కన్వెన్షన్‌ హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 2 నుండి 17 వరకు జరగనున్నాయి. మధ్యలో ఓ రెండు రోజులు పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల పర్యటనకు చంద్రబాబు వెళ్లనున్నట్లు తెలిసింది. సమీక్షలను ఉదయం 9 గంటలకు ప్రారంభించి, మధ్యాహ్నం వరకు నివేదికలపై సమీక్షలు జరపడం, మధ్యాహ్నం నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు చెబుతున్నారు.

పార్టీ అధిష్టానం సమీక్షలను సీరియస్‌గా తీసుకోవడంతో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో తెలియని ఆందోళన వ్యక్తమవుతోంది. సమీక్షల గడువు దగ్గర పడటంతో పార్టీ నేతలు బూత్‌లు, ఓటర్లు, మహిళా ఓటర్లు, కులాల వారీగా పార్టీకి వచ్చిన ఓట్లు ఎంతమేర ఉన్నాయి? ఆయా కేంద్రాల్లో పార్టీ ప్లస్‌లో ఉందా, మైనస్‌లో ఉందా? దీనికి కారణాలేమిటనే విషయంపై ఆయా అభ్యర్థులు నివేదికలో పొందుపరచాల్సి ఉండటంతో అభ్యర్థుల్లో ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో ఒక రోజు సమీక్ష నిర్వహించిన అభ్యర్థులు సమర్పించిన జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. 

అభ్యర్థులు ఎన్నికల్లో ఎంత మేర ఖర్చు చేశారు? ప్రత్యర్థిపార్టీలు అనుసరించిన వ్యూహమేమిటి? అభ్యర్థుల బలా బలాలు తదితర అంశాలపై లోతుగా సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. నియోజకవర్గాల నుంచి హాజరయ్యే కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలను రాబోవు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎలా ఉపయోగంచుకోవాలనే అంశంపై సమీక్షల్లో చర్చకు రావచ్చని సమాచారం.