మావోయిస్టులతో సంబంధాలు వున్నందుకే అరెస్టులు

నిషేధిత సిపిఐ(మావోయిస్టు)లతో సంబంధాలు వున్నాయని స్పష్టమైన సాక్ష్యాధారాలు లభించడంతో ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. అంతే కానీ అసమ్మతి భావాలు వ్యక్తం చేసినందుకు వారిని అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేసింది.

అసమ్మతి వెలిబుచ్చడం అనేది ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. భీమా కొరెగావ్‌ హింసాకాండకు సంబంధించిన కేసులో ఈ కార్యకర్తల అరెస్టును సవాలు చేస్తూ చరిత్రకారిణి రొమిలా థాపర్‌ తదితరులు వేసిన పిటిషన్‌పై మహారాష్ట్ర పోలీసులు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు.

దేశంలో హింసను రెచ్చగొట్టడానికి, భద్రతా బలగాలపై దాడులకు వారు కుట్ర పన్నారని పోలీసులు పేర్కొన్నారు. తమ దగ్గర తగిన సాక్ష్యాధారాలు వున్నాయని చెప్పారు. అయినా రొమిలా థాపర్‌, ప్రభాత్‌ పట్నాయక్‌, దేవికా జైన్‌, తదితరులకు దీంతో సంబంధం లేదని పేర్కొన్నారు.

గత నెల 28న పలు రాష్ట్రాల్లో వామపక్ష భావజాలం కలిగిన పలువురి ఇళ్లపై మహారాష్ట్ర పోలీసులు దాడులు జరిపారు. మానవ హక్కులను సమర్ధిస్తూ పెద్ద ఎత్తున నిరననలు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దాంతో వారిని ఈనెల 6వరకు గృహ నిర్బంధంలో కొనసాగించాలని ఆగస్టు 29న సుప్రీం ఆదేశించింది.