రాజకీయ పిచ్‌పై ‘సిక్సర్లు’ కష్టమే

రాజకీయాలు అన్నవి నల్లేరు మీద నడక కాదని. క్రికెట్ పిచ్‌కు, ఎన్నికల గోదాకు చాలా తేడా ఉందని, అయినప్పటికీ ఇందులో ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కోడానికి సిద్ధమయ్యే తాను రాజకీయాల్లోకి వచ్చానని మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ తెలిపారు. ఇటీవల బిజెపిలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఆయన రాజకీయ ఆట తనకు పూర్తిగా కొత్త అని, దీనిపై సిక్సర్లు అంత సులభం కాదని చెప్పారు. కొన్ని వివాదాస్పద అంశాలపై ఎలా ప్రతిస్పందించాలో కూడా తనకు తెలియదని అంగీకరించారు.

ఈ స్థానంలో తాను పోటీ చేయకుండా అనర్హుడిని చేయాలని విపక్షాలు మొదటి నుంచి అడ్డంకులు సృష్టిస్తున్నాయని, కొన్ని సాంకేతిక కారణాలు చెబుతూ తన నామినేషన్‌ను తిరస్కరించాలని కాంగ్రెస్.. ఎన్నికల అధికారులపై వత్తిడి తెచ్చిందని గుర్తు చేశారు.  తర్వాత తాను రెండు ఓటరు కార్డులు కలిగి ఉన్నానని ఫిర్యాదు చేశారని, ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఎన్నికల ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణపై తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఈసీ ఆదేశించిందని ఆయన చెప్పారు.

రాజకీయాల్లో ఎదురయ్యే సవాళ్లు తనకు చాలా కొత్తగా ఉన్నాయని, ఒక్కోసారి వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కావడం లేదని నిజాయతీగా ఒప్పుకున్నారు.  కాగా, తనకు రాజేందర్ నగర్ నుంచి ఒకే ఒక్క ఓటరు కార్డు ఉందని, తన ముత్తాతలతో పాటు కరోల్ బాగ్‌లోని రామ్‌జాస్ రోడ్‌లోనే తాను చిన్నప్పటి నుంచి ఉంటున్నానని ఆయన స్పష్టం చేశారు. అయితే అక్కడ ఓటరు కార్డుకు దరఖాస్తు చేయడం కాని, ఓటు వేయడం కాని ఎప్పుడూ చేయలేదని వెల్లడించారు.

గత ఏడాడే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ 38 ఏళ్ల మాజీ క్రికెటర్ రూ 147 కోట్ల ఆస్తితో ఢిల్లీలో పోటీ చేసే అభ్యర్థులందరిలో సంపన్నుడిగా నిలిచాడు. రెండు ప్రపంచ కప్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన తాను క్రికెట్ కెరీర్ సైతం అంత సులభంగా ఏమీ సాగిపోలేదని, అందులో ఎదుర్కొన్న సవాళ్లు, ఇబ్బందులు తనని రాటుదేలేలా చేశాయని, వాటిని ఎదుర్కొనే శక్తిని ఇచ్చాయని చెప్పారు.

ఇప్పుడు రాజకీయాలు కూడా అంత సులభమైనవని తాను భావించడం లేదని, అందులోనే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధపడే తాను ఇందులోకి వచ్చానని, అందుకే తాను ప్రతిసభలోనూ అనుకూల రాజకీయాలనే అనుసరిస్తానని స్పష్టం చేశారు. ఢిల్లీ నగరాన్ని లండన్‌లాగో, ప్యారిస్‌లాగా తయారు చేయాలని అనుకోవడం లేదని, మన తర్వాతి తరం వారు స్వచ్ఛమైన గాలి పీల్చుకుని, స్వచ్ఛమైన నీరు తాగగలిగే పర్యావరణాన్ని సృష్టించాలన్నది తన కోరిక అని గౌతమ్ గంధీర్ తెలిపారు.