నాలుగో విడత 64 శాతం పోలింగ్, రణరంగాన్ని తలపించిన బెంగాల్

నాలుగో విడుత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రణరంగాన్ని తలపించింది. అనేక పోలింగ్ కేంద్రాల వద్ద బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశించింది. మరోవైపు ఈ విడుత పోలింగ్‌లో కూడా యథారీతిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) మొరాయించాయి. 

ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలోని అనేక పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదులు వచ్చాయి. తొమ్మిది రాష్ర్టాల పరిధిలోని 72 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 64 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. బెంగాల్‌లో అత్యధికంగా 76.66 శాతం, జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో అత్యల్పంగా 10.3 శాతం పోలింగ్ నమోదైంది. 

బెంగాల్‌లో 2014 కన్నా ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. మహారాష్ట్రలోని 17, రాజస్థాన్, యూపీలో 13 చొప్పున, పశ్చిమబెంగాల్‌లో 8, మధ్యప్రదేశ్, ఒడిశాలోని ఆరేసి స్థానాలు, బీహార్‌లో ఐదు, జార్ఖండ్‌లోని మూ డు సీట్లకు సోమవారం పోలింగ్ నిర్వహించారు. అలాగే అనంత్‌నాగ్‌లోని కొంత భాగంలో కూడా పోలింగ్ జరిగింది.

పశ్చిమ బెంగాల్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ, తృణమూల్ పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగినట్టు వార్తలందాయి. ఓ పోలింగ్ కేంద్రంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర బలగాలు గాలిలోకి కాల్పులు జరుపడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు. బీజేపీ కేంద్ర బలగాలను దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. 

పోలింగ్ కేంద్రంలోపలికి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లవద్దని చెప్పిన కేంద్ర భద్రతా బలగాలతో ఓటర్లు తోపులాటకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరుపడంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. కేంద్ర బలగాలు ఓటర్లలో భయాందోళనలు సృష్టించాయని తృణమూల్ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ ఈసీకి విజ్ఞప్తి చేసింది.   

ఒడిశాలోని ఆరు లోక్‌సభ, 41 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 64.05 శాతం పోలింగ్ నమోదైంది. కాగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. జగత్‌సింగ్‌పూర్ నియోజకవర్గంలో ఓటు వేసి వస్తున్న ఓ కాంగ్రెస్ కార్యకర్త కత్తిపోట్లకు గురై మరణించాడని చెప్పారు. ఆ వ్యక్తి ఇటీవలనే బీజేడీ నుంచి కాంగ్రెస్‌లో చేరాడని తెలిపారు. మరికొన్ని ప్రాంతాలలో రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ, బీజేడీ కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగినట్టు చెప్పారు. 60 కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

బీహార్‌లోని ఐదు సీట్లలో 59.02 శాతం పోలింగ్ జరిగింది. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయలేదని అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లోని మూడు స్థానాలలో 64.38 శాతం పోలింగ్ నమోదైంది. లొహార్‌దాగా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన మొదటి మహిళా ఓటరుకు స్థానిక సబ్ డివిజనల్ అధికారి గరీమా సింగ్ ఓ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మధ్యప్రదేశ్‌లోని ఆరు స్థానాల్లో సగటున 67.09 శాతం పోలింగ్ నమోదైంది. 313 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో వాటిని మార్చారు. 

రాజస్థాన్‌లోని 13 సీట్ల పరిధిలో 67.73 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 13 సీట్ల పరిధిలో 58.56 శాతం పోలింగ్ నమోదైంది. నంత్‌నాగ్ నియోజకవర్గంలోని కొంత భాగంలో జరిగిన పోలింగ్‌లో 10.3 శాతం మాత్రమే నమోదైంది. 

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల్లో విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ముగ్గురు ఉద్యోగులు అనారో గ్యం కారణంగా మృతి చెందారు. చింద్వారా లోక్‌సభ స్థానం పరిధిలో సునందా కోటేకర్ (50) అనే మహిళా అధికారి, సిద్ధీ జిల్లాలో ఓ ఏఎస్‌ఐ గుండెపోటుకు గురై మరణించారని ఎన్నికల అధికారి చెప్పారు. బాలాఘాట్ నియోజకవర్గం పరిధిలో ఓ ఉద్యోగి మెదడులో రక్తస్రావంతో మరణించారని తెలిపారు.