ఇంటర్ ఫలితాల వైఫల్యాలపై లక్ష్మణ్ నిరవధిక దీక్ష

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం న్యాయం చేయాలన్న డిమాండ్‌తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నాటకీయ పరిణామాల నడుమ సోమవారం నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి తొలగించాలని, ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై న్యాయ విచారణ జరపాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు  ముషీరాబాద్‌లోని లక్ష్మణ్‌  క్యాంపు కార్యాలయం ముందు మోహరించారు. ఆయన బయటకు రాగానే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి ట్యాక్సీ కారులో చాకచక్యంగా ఆయన బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన వేదిక వద్ద ఆయన నిరాహార దీక్షకు దిగారు.

ఇంటర్ ఫలితాల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని భావిస్తోంది. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఆ కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతి తెలుపకపోగా తూ.తూ.మంత్రంగా చర్యలు తీసుకోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇంటర్‌ విద్యార్థులకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే బర్త్‌రఫ్ చేయాలని, ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. గ్లోబరీనా సంస్థ అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమండ్‌ చేశారు.

మాజీ కేంద్ర మంత్రి  బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి డీకే అరుణ, బిజెపి ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.