ముందస్తు ఎన్నికలకు ముహూర్తం రేపే

తెలంగాణలో ముందస్తు ఎన్నికల విషయమై కొద్ది రోజులుగా భారీగా కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చివరకు ముహూర్తం ఖరారు చేసిన్నట్లు చెబుతున్నారు. దానితో శాసనసభ రద్దుకు మార్గం సుగామమైనది. గురువారం ఉదయం మంత్రివర్గం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చహ్రు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతకం ప్రకారం గురువారం ఉదయం 6 గంటల నుంచి 7 వరకు కీలక నిర్ణయాలకు అత్యంత అనుకూల సమయమని, ఆయన నక్షత్ర, రాశులకు అనుకూలంగా గ్రహస్థితులు ఆ రోజు ఉన్నాయని, అందుకే ఆ సమయాన మంత్రివర్గ భేటీకి ఆయన సిద్ధమైనట్లు తెలియవచ్చింది.

మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకోవడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో కేబినెట్‌ భేటీకి అవసరమైన అన్ని అంశాలను సాధారణ పరిపాలనశాఖ పూర్తి చేసింది. గురువారం ఉదయానికి హైదరాబాద్‌లో ఉండాలంటూ మంత్రులకు ఇప్పటికే సమాచారం పంపింది. మంత్రివర్గ భేటీలో అసెంబ్లీ రద్దు అంశాన్ని చివరి నిమిషంలో ఎజెండాలో చేరుస్తారని, ఇప్పటికిప్పుడు ఎజెండాలో ఈ అంశం లేదని తెలిసింది.

తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేస్తే డిసెంబర్‌లోగా కచ్చితంగా ఎన్నికల జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘంలోని ఉన్నత స్థాయి అధికారుల నుండి ఖచ్చితమైన హామీ లభించిన తర్వాతనే కెసిఆర్ ఈ దిశలో వేగంగా అడుగులు వేయడం ప్రారంభించారు. స్పష్టమైన సంకేతం అందాక పోవడంతోనే `ప్రగతి నివేదన’ సభలో ఈ విషయాన్ని దాటవేసారని తెలుస్తున్నది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, కరీంనగర్‌ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌ వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసి, ఈ విషయమై ఎన్నికల కమీషన్ నుండి భరోసా లభించే విధంగా కృషి చేసారని చెబుతున్నారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వీరిద్దరు ఢిల్లీ అంశాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. అనంతరం అసెంబ్లీ రద్దు ప్రక్రియపై కసరత్తు వేగవంతమైంది.

ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దం కావడంతో  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ కూడా వేగంగా అడుగులు వేయడం ప్రారంభించారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషిని కలిసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో నెలకొన్న సిబ్బంది కొరత విషయాన్ని ప్రస్తావించారు. అదనపు సీఈవో పోస్టులో ఐఏఎస్‌ అధికారిని నియమించాలని, జాయింట్‌ సీఈవో, డిప్యూటీ సీఈవోతోపాటు మరో 18 పోస్టులను భర్తీ చేయాలని రజత్‌ కుమార్‌ ఈ సందర్భంగా కోరారు. ఒకటి రెండు రోజుల్లోనే సీఈవో కార్యాలయంలో పూర్తిస్థాయి అధికారులు, సిబ్బంది నీయమించ గలమని ప్రభుత్వం నుండి హామీ పొందారు.

మరోవైపు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో కార్యాలయం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటలకు సమావేశం నిర్వహిస్తోంది. అలాగే జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈవో)గా పని చేసే కలెక్టర్లకు ఈ నెల 7న శిక్షణ కార్యక్రమం జరగనుంది. 

పోలీస్‌శాఖ సహితం తగిన కార్యాచరణ, బలగాల పరిస్థితి, సిబ్బంది తదితర అంశాలపై దృష్టి పెట్టింది. ఎన్నికల బందోబస్తు కోసం సిద్ధంగా ఉండేలా కార్యచరణ రూపొందించాలని మౌఖికంగా బెటాలియన్‌ విభాగానికి పోలీస్‌శాఖ నుంచి సూచనలు వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తం బెటాలియన్ల నుంచి 7–8 వేల మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. అలాగే అన్ని జిల్లాలు కమిషనరేట్లలో కలిపి సుమారు 3,500 మందిని కూడా ఎన్నికల విధుల్లో నియమించనున్నారు.