మీడియాను బహిష్కరిస్తున్నా..కుమారస్వామి అలక!

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి మరోసారి తాను మీడియాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. సమాధానాలు చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు మీడియాపై అలక వహించడం ఆయనకు పరిపాటిగా వస్తున్నది. తన కుమారుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్న మాండ్యా లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల కవరేజీపై కలత చెందినట్టుగా ఉన్న కుమార స్వామి ఈ విషయాన్ని నేరుగా మీడియాకే చెప్పారు.

కుమారుడు విజయావకాశాలపై కలత చెందిన్నట్లు కనిపిస్తున్న ఆయన ‘మీ వార్తాకథనం (స్టోరీ) కోసం మీరు ఏమి కావాలనుకుంటే అది చేసుకోండి.. వెళ్లండి చేసుకోండి’ అని కుమార స్వామి అసహనం వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి మీడియాపై అలా మండిపడటానికి గల ఖచ్చితమయిన కారణమేంటనేది తెలియరాలేదు.

తన కుమారుడు నిఖిల్ జేడీ(ఎస్) అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాండ్యా లోక్‌సభ నియోజకవర్గంలో దివంగత అంబరీష్ భార్య, బహుభాషా నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ గట్టి పోటీ నెలకొని ఉంది. ఎవరు గెలుస్తారనేది అంచనా వేయలేని అనిశ్చితి నెలకొని ఉంది. ఈ సీటును దక్కించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్న కుమార స్వామి గతంలోనూ తరచుగా మీడియాపై మండిపడ్డారు. మీడియా సుమలతకు మద్దతు పలుకుతోందని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి మీడియాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం గత నవంబర్‌లోనూ కుమారస్వామి తాను ఏ కారణం రీత్యానూ మీడియాను ఉద్దేశించి మాట్లాడబోనని ప్రకటించారు.సభలలో తన ప్రసంగాలు వ్రాసుకోవచ్చని, తాను మీడియా సమావేశాలు మాత్రం ఏర్పాటు చేయబోనని స్పష్టం చేశారు. అయితే ఆ మాటపై ఎక్కువ రోజులు నిలబడలేక పోయారు.