కేజ్రివాల్‌పై ఒకే రోజు రెండు ఫిర్యాదులు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌పై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ రెండు ఫిర్యాదులు చేసింది. ఢిల్లీలో రేడియో కార్యక్రమాల పేరుతో ప్రజా ధనాన్ని వృధా చేస్తూ మత పరమైన భావాలను ప్రేరేపించేందుకు వాడుకుంటున్నారని బీజేపీ ఆరోపించింది.

మొదటి ఫిర్యాదు బీజేపీ నేత ప్రవీన్ శంకర్ కపూర్ చేశారు. రేడియో కార్యక్రమంలో కేజ్రివాల్ మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొని కేవలం 325 కోట్ల రూపాయలు ఇచ్చింది’ అని కేజ్రివాల్ అన్నారని, ఇది ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమని ఈసీకి చేసిన ఫిర్యాదులో శంకర్ పేర్కొన్నారు.

ఇకపోతే ఢిల్లీలో ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలు చేస్తూ ప్రజా ధనం వృధా చేస్తున్నారని రెండో ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. బీజేపీ జాతీయ కార్యదర్శి నీరజ్ ఈ ఫిర్యాదు చేశారు. మత పరమైన భావాలను ప్రేరేపిస్తూ ఓటర్లను కేజ్రివాల్ ప్రలోభ పెడుతున్నారని ఈసీకి చేసిన రెండవ ఫిర్యాదులో నీరజ్ పేర్కొన్నారు.