పోలవరం రానున్న కేంద్ర నిపుణుల బృందం

పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తిచేసే బాధ్యత తమదే అని చెబుతూ వస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశలో కీలక నిర్ణయం తీసుకోవడం కోసం ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించి, పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికిచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరానికి చేరుకోనుంది. ఈ కమిటీ గురువారం, శుక్రవారాల్లో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తుంది. అనంతరం జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది.

ఆ తర్వాత శుక్రవారం రాత్రికి ఢిల్లీకి చేరుకుంటుంది. ప్రాజెక్టు పనుల్లో వాస్తవ స్థితిగతులపై కేంద్రానికి నివేదికిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా పోలవరంపై కేంద్రప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని కీలక నిర్ణయం తీసుకునే వీలుంది. అందుచేత ఈ కమిటీ పర్యటనకు అత్యంత ప్రాధాన్యమేర్పడింది. పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్‌ 7, 2016న దక్కించుకోవడం తెలిసిందే.

పోలవరం ప్రాజెక్ట్ పనులలో చెప్పుకోదగిన పురోగతి సాధించినా కొద్ది నెలలుగా ముందుకు సాగడం లేదు. దానితో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యుడు మసూద్‌ హుస్సేన్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మార్చి 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు ప్రాజెక్టు పనులను పరిశీలించి, మార్చి 21న కేంద్రానికి మొదటి నివేదిక అందజేసింది.

పనుల పురోగతిపై రాష్ట్రప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వాస్తవ స్థితిగతులకు పొంతనే లేదని ఈ నివేదిక వెల్లడి చేసింది. కనీసం డిజైన్‌లూ రూపొందించలేకపోవడాన్ని తప్పుబట్టింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డిజైన్‌లపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. తర్వాత జూలై 11న కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించి, గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.57,940.86 కోట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు (డీపీఆర్‌–2) ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిస్తంభానకు దారితెస్తున్నది. ఈ ప్రిపదనలపై పలు సందేహాలను కేంద్రం వ్యక్తం చేస్తున్నది. వాటిని నివృత్తి చేస్తే గాని ముందుకు సాగలేమని కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కారి స్పష్టం చేసారు.  దీంతో రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు ఇటీవల రెండు దఫాలుగా ఢిల్లీకి వెళ్లి సీడబ్ల్యూసీ అధికారులతో సమావేశమై వివరణలిచ్చారు.

రాష్ట్ర అధికారులు ఇచ్చిన వివరణలతో సీడబ్ల్యూసీ సంతృప్తి చెందడందు. క్షేత్రస్థాయిలో పరిశీలించాక, వాస్తవ స్థితిగతుల ఆధారంగానే డీపీఆర్‌–2పై నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో పోలవరం పనుల పరిశీలనకు నిపుణుల కమిటీని కేంద్రం పంపిన్నట్లు తెలుస్తున్నది. మసూద్‌ హుస్సేన్‌ సీడబ్ల్యూసీ చైర్మన్‌గా పదోన్నతి పొందిన నేపథ్యంలో ప్రస్తుతం కమిటీకి సీడబ్ల్యూసీ సభ్యుడు వైకే శర్మ నేతృత్వం వహించనున్నారు.