ఇంటర్ ఫలితాల వైఫల్యాలపై లక్ష్మణ్ ఆమరణ దీక్ష !

తెలంగాణ ప్రభుత్వపు ఇంటర్‌ ఫలితాల వైఫల్యాలకు నిరసనగా బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు డా కె లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నుండి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ప్రకటించారు.  ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు, ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని మురళీధర్‌రావు ప్రశ్నించారు.  ఇంటర్ దోషులను ప్రభుత్వం ఎందుకు కాపాడాలని చూస్తోందని నిలదీశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

నివేదిక పేరుతో ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని  మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై కమిటీ నివేదిక ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని  పెదవి విరిచారు. గ్లోబరీనాకు టెండర్‌ ఇవ్వడం వెనుక సూత్రధారి ఎవరో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. గ్లోబరీనాకు టెండర్‌ కట్టబెట్టడం వెనుక రాజకీయ అదృశ్య శక్తి ఉందని.. మంత్రి జగదీశ్ రెడ్డి కేవలం పాత్రధారి మాత్రమేనని ఆరోపించారు. బంగారు తెలంగాణ కాదు, బలుల తెలంగాణగా మారిందని దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు.