ఏపీకి పొంచి ఉన్న ఫొని తుఫాన్ ముప్పు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పాడిన ‘ఫొని’ తుపాను క్రమంగా బలపడుతోంది. వాయువ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. ఇది మరో 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పొని తుపాను ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలికి 750 కిలోమీటర్లు, చెన్నైకి 1,080 కిలోమీటర్లు, మచీలీపట్నంకు 1,260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృమైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

మరో 24 గంటల్లో మరింత బలపడి పెనుతుపానుగా మారే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.  ఈ నెల 30న ఫొని తన దిశను మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటునుంచి ఈశాన్య బంగాళాఖాతం దిశగా మరలి కోస్తాంధ్ర తీరం వెంట ప్రయాణించి బంగ్లాదేశ్‌ వైపు వెళ్లే అవకాశం ఉందని పలు ప్రైవేటు వాతావరణ వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి. 

మే ఒకటో తేదీ నుంచి నాల్గో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంటే అంటే 200 నుంచి 300 కి.మీ.దూరంలో ప్రయాణించే అవకాశాలున్నట్లు అవి తెలియజేస్తున్నాయి. ఒడిశా తీరానికి కాస్త దగ్గరగా వెళ్లి బంగ్లాదేశ్‌ వైపు కదులుతుందని అంచనా వేస్తున్నాయి.

ఈ నెల 29, 30 తేదీల్లో కేరళలో భారీ నుంచి తేలికపాటి వర్షాలుంటాయని.. తమిళనాడు, కోస్తాంధ్రలో ఏప్రిల్‌ 30, మే 1న పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. తుపాను ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో 80 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయని చెబుతున్నారు. ఈ వేగం 90-115 కి.మీ.కు  పెరుగుతుందని తెలిపారు. 

ఈ నెల 29నాటికి 145 నుంచి 170 కి.మీ.కు పెరుగుతుందని అంచనా వేశారు. ఈ గాలుల ప్రభావం 30వ తేదీ రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌ తీరంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలపై ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత క్రమంగా వేగం తగ్గుతుందని చెబుతున్నారు. మే 2వ తేదీకి ఏపీ తీరంలో గాలుల వేగం గంటకు 125-150 కి.మీ.ఉండే అవకాశం ఉందని తెలిపారు. 

ఈ నేపథ్యంలో సముద్రం చాలా చురుగ్గా ఉంటుందని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని సూచించారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లినవారుంటే ఆదివారంలోపు తీరానికి వచ్చేయాలని హెచ్చరించారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలను ఎగరేసినట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ప్రకటించారు.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు.