ప్రధాని నరేంద్ర మోదీ 'వర్క్‌హాలిక్'

ప్రధాని నరేంద్ర మోదీ 'వర్క్‌హాలిక్' అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కితాబిచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరచు సెలవులపై వెళ్లిపోతుంటారని ఎద్దేవా చేశారు. ప్రధాని రోజుకు 18 గంటలు పనిచేస్తారని, రాహుల్ మాత్రం ప్రతి రెండు-మూడు నెలలకు ఒకసారి విదేశాలకు సెలవుపై వెళ్లిపోతుంటారని చెప్పారు.

 జార్ఖండ్‌లోని పలములో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ 'గుజరాత్‌లో మోదీ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆయనతో పని చేస్తూ వచ్చాను. 20 ఏళ్లుగా ఆయన నాకు తెలుసు. ఆయన ఒక్కరోజు కూడా సెలవు తీసుకున్నదే లేదు. మరో వైపు రాహుల్ బాబా ప్రతి రెండు నెలలకు పార్టీ నేతలు, కార్యకర్తలు, చివరకు తల్లిని కూడా విడిచిపెట్టి విదేశాలకు సెలవుపై వెళ్లిపోతుంటారు' అని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్కసారి కూడా పాకిస్థాన్‌కు ధీటైన జవాబు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన సాహసిక జవాను హేమరాజ్‌‌ను పాకిస్థాన్ సరిహద్దు కార్యాచరణ బృందం ఛిద్రం చేసి, అత్యంత పాశవికంగా తలనరికి, కాలితో తన్నడాన్ని తాను ఇప్పటికీ మరచిపోలేనని, ఇంత జరిగినా యూపీఏ చేసిందేమీ లేదని, మన్మోహన్ సింగ్ మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోయారని అమిత్‌షా తప్పుపట్టారు.

 కశ్మీర్‌లో 370 అధికరణను తొలగించాలన్న తమ ప్రయత్నానికి కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుపడుతోందని, ఈ విషయంలో జార్ఖాండ్, బీహార్‌లోని కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిచ్చి తప్పు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే 370 అధికరణను రద్దు చేసి తీరుతామని స్పష్టం చేశారు. 

గత నాలుగైదు నెలలుగా తాను దేశవ్యాప్తంగా తిరుగుతున్నానని, ఎక్కడకు వెళ్లినా 'మోదీ-మోదీ' నినాదాలు మారుమోగుతున్నాయని చెప్పారు. దేశప్రజలు ఎంతో తెలివిగా ఏకగ్రీవంగా ఎంచుకున్న ప్రభుత్వమిదని, ఈసారి కూడా ప్రజలు అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటారనే నమ్మకం తనకు ఉందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు.