లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అమెజాన్‌

లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ కంపెనీగా అమెజాన్‌ అవతరించింది. ప్రపంచంలోనే ఈ ఘనతను  సాధించిన రెండో కంపెనీ ఇదే. ఇటీవలే ఐఫోన్‌లు తయారు చేసే యాపిల్‌ కంపెనీ తొలి లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా రికార్డ్‌ సాధించింది.

న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో అమెజాన్‌ షేర్‌ 2% లాభంతో 2,050 డాలర్లను తాకింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్‌  క్యాప్‌ లక్ష కోట్ల డాలర్ల మార్క్‌ను దాటింది. యాపిల్‌ ఈ ఘనత సాధించిన 5 వారాల తర్వాత అమెజాన్‌ ఈ మైలురాయిని దాటింది.

1994లో సియాటెల్‌లో జెఫ్‌ బెజోస్‌ అమెజాన్‌ను స్థాపించారు. 1997లో 18 డాలర్లకు ఐపీఓకు వచ్చింది. ఇప్పుడు కంపెనీ షేర్‌ ధర 2,050 డాలర్లను తాకింది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా  ఈ షేర్‌ 70% ఎగసింది.

ఆరంభంలో పుస్తకాలు అమ్మిన అమెజాన్‌ కంపెనీ ఆన్‌లైన్‌ షాపింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఇరవై ఏళ్లలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్‌లైన్‌ రిటైల్‌ కంపెనీగా నిలిచింది. అమెజాన్‌ విజయంతో ఈ కంపెనీ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా అవతరించాడు.