క్షీణదశలో నక్షలిజం, తిరోగమనంలో ఈశాన్యంలో హింస

కేంద్ర ప్రభుత్వ కృషి వల్లే దేశంలో నక్షలిజం క్షీణదశకు  చేరుకోగా,ఈశాన్య రాష్ట్రాల్లో హింస, తిరుగుబాట్టు దగ్గుముఖం పట్టాయని హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సమర్థత, సుపరిపాలనకు మెచ్చిన ప్రజలు మరోసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

‘ఐదేళ్ల మోదీ పాలనకు దేశ, విదేశాలు నీరాజనం పడుతున్నాయి. ఎన్‌డీఏ తిరిగి అధికారంలోకి వచ్చే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగింట మూడొంతుల మెజారిటీ సాధించి తీరుతుంది‘అని హోమ్‌మంత్రి ధీమా వ్యక్తం చేశారు. హోమ్‌మంత్రిగా తాను సాధించిన విజయాలు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో వెల్లడించారు.

ఈశాన్య రాష్ట్రాల్లో గతంలోవలే తిరుగుబాట్లు లేవని, దేశం మిగతా ప్రాంతాల్లో నక్సలిజం తెరమరుగైందని ఆయన వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు చరమాంకానికి చేరుకున్నట్టేనని రాజ్‌నాథ్ ప్రకటించారు. నక్సలిజంపై మాట్లాడుతూ 1971 నాటి పరిస్థితులు లేవని అన్నారు. ఒకప్పుడు నక్సల్స్ చేతిలో అనేక మంది చనిపోయేవారని ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నంగా ఉందని తెలిపారు. భద్రతాదళాలే నక్సలైట్లను ఏరివేస్తున్నాయని, వామపక్ష తీవ్రవాదంపై సాయుధ బలగాలే పైచేయి సాధించాయని స్పష్టం చేశారు.

ఇంతకు ముందు 126 జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉండేదని ఇప్పుడు ఆరేడు జిల్లాలకు పరిమితమయ్యారని ఆయన చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో ఎక్కువ పర్యాయాలు పర్యటించిన హోమ్‌మంత్రిని తానేనని, అక్కడ దీర్ఘకాలిక సమస్య పరిష్కరించే దిశగా అనేక చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. కాగా విదేశీ విరాళాల(క్రమబద్ధం) చట్టం కింద ప్రపంచ నలుమూలల నుంచి నిధులు తీసుకొచ్చిన కొన్ని సంస్థలు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని తేలిందని, అలాంటి 2000 సంస్థల గుర్తింపును హోమ్‌మంత్రిత్వశాఖ రద్దుచేసినట్టు రాజ్‌నాథ్ వెల్లడించారు.

యూపీలోని లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాజ్‌నాథ్ సింగ్ ‘మోదీ సమర్ధవంతమై నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది’అని శ్లాఘించారు. కేబినెట్ సహచరులతో చర్చించిన తరువాతే నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప ఏకపక్షంగా లేదా ఎంపీలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న వాదన సరికాదని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అంశాలు లేవన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా ‘ పార్టీ మేనిఫెస్టో కమిటీ అవి ఎన్నికల ప్రచార అంశాలు కాదని భావించింది‘ అని బదులిచ్చారు.

బయట వ్యక్తులకు పార్టీ టికెట్లు ఇచ్చార్న వాదనతో ఆయన ఏకీభవించలేదు. ప్రజాదరణ ఉన్న వ్యక్తులకు పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం జరుగునే ఉంటుందని ఆయన తెలిపారు. మహారాష్ట్రంలో బీజేపీ-శివసేన కూటమి బలంగానే ఉందని, ఎన్నికల ఫలితాల్లో అది రుజువవుతుందని ఆయన స్పష్టం చేశారు.