మోదీజీ ఇప్పటికే గెలిచేశారనే ప్రచార ఉచ్చులోపడొద్దు

తాను ఇప్పటికే గెలిచిన్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచార ఉచ్చులో పడొద్దని ప్రజలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి రెండోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాని మోదీ  నామినేషన్  దాఖలు చేసిన సందర్భంగా మాట్లాడుతూ “మోదీజీ ఇప్పటికే గెలిచేశారని.. ఇక ఓటు వేయకపోయినా ఫరవాలేదు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారి ఉచ్చులో పడొద్దు. ఓటు మీ హక్కు. ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలి. పోలింగ్  రోజు భారీ ఎత్తున తరలి రావాలి” అని ప్రజల్ని మోదీ కోరారు.కోరుకుంటున్నానన్నారు. 

అట్టహాసంగా జరిగిన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు ఎన్డీయే నేతలు, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు. ఈసారి ఆయన నామినేషన్‌ను ప్రతిపాదించిన వారిలో బీజేపీ సీనియర్ నాయకుడితో పాటు ఓ చౌకీదార్, ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, వారణాసి మణికర్ణిక  ఘాట్‌లో దహన సంస్కారాలు నిర్వహించే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఉండడం గమనార్హం. 

మరోవైపు మోదీ నామినేషన్ నేపథ్యంలో ఎన్డీఏ నాయకులు వారణాసికి  తరలివచ్చారు. దీంతో నామినేషన్‌కు ముందు కలెక్టరేట్ కార్యాలయంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, ఎల్జేపీ అధ్యక్షుడు రామ్విలాస్ పాశ్వాన్, అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం,  తంబిదురై, అప్నాదళ్, నార్త్‌ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ నేతలతో  మోదీ భేటీ అయ్యారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 93 ఏళ్ల ప్రకాశ్ సింగ్  బాదల్‌కు మోదీ పాదాభివందనం చేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందరర్భంగా ప్రకాశ్ సింగ్ బాదల్  మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. తదుపరి ప్రధాని మోదీయే అని.. ఆయనతో ఎవరూ పోటీ పడలేరని అభిప్రాయపడ్డారు. అనంతరం తన నామినేషన్ ప్రపోజర్‌లలో ఒకరైన 92 ఏళ్ల అన్నపూర్ణ శుక్లా కాళ్లకు కూడా  మోదీ నమస్కరించారు. 

వారణాసిలో నామినేషన్ వేసేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి  బీజేపీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఆయన కారుపై పూల వర్షం కురిపించారు. కాలభైరవుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా స్థానిక మహిళలతో మోదీ కరచాలనం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలతో మోదీ మాట్లాడారు.

‘స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్ల తర్వాత అధికార పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు అంగీకరించాలి. ప్రజలు తమ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. గత నెలన్నర రోజులగా దేశంలోని అన్ని ప్రదేశాలు తిరిగాను. మోదీ, షా, యోగి అందరూ బీజేపీ కార్యకర్తలే. ఈ ఎన్నికల్లో మా తరపున దేశప్రజలు పోరాడుతున్నారు’ అని  ప్రధాని చెప్పారు. ఇక వారణాసిలో ఘన విజయం సాధించడం.. పోటీచేసిన అన్ని చోట్ల బీజేపీ జెండా ఎగురవేయడం మన ముందున్న రెండు ప్రధాన అంశాలని తెలిపారు.

బీజేపీ ప్రతి బూత్ కార్యకర్త విజయం సాధించి కాషాయ జెండా మరింత ఎత్తున ఎగిరేలా చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘ఈసారి కూడా నేను రికార్డు విజయం సాధించాలని కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. నా విజయమొక్కటే ముఖ్యం కాదు. దేశం ప్రజాస్వామ్య విజయం సాధించాలన్న దానిపైనే నాకు ఎక్కువ ఆసక్తి. తనకు గంగమ్మ దీవెనలు ఎప్పుడూ ఉంటాయి’ అని మోదీ చెప్పారు. గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు కావడం మాత్రమే చూశామనీ.. కానీ గత ఐదేళ్ల నుంచి ప్రభుత్వం పనిచేయడం చూస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.

“నేను ప్రధానమంత్రిని అని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఒక్క కార్యకర్తను కూడా కలుసుకోకుండా ఉండలేదు. నాలోని కార్యకర్తను కూడా చావనివ్వలేదు. ప్రధానిగానూ, ఎంపీగానూ నా విధులు ఎలా నిర్వహించాలో నాకు తెలుసు...” అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ “మళ్లీ ఒక్కసారి” అనగానే... “మోదీ సర్కార్‌” అంటూ కార్యకర్తలు నినదించడం విశేషం. 

కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నామినేషన్ సందర్భంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధానమంత్రిని ఎన్నుకుంటున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులని ఆమె చెప్పారు. దేశంలోని మిగతా లోక్‌సభ నియోజకవర్గాల ప్రజలు పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటున్నారని, కాని ఒక్క  వారణాసి నియోజకవర్గ ఓటర్లకు మాత్రం సాక్షాత్తూ దేశానికి ప్రధానమంత్రినే ఎన్నుకునే అదృష్టం లభించిందని సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు.  ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు నాలుగింట మూడొంతుల మెజారిటీ లభిస్తుందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.