ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలనే

ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలనే ఆలోచనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని టీమిండియా మాజీ ఆటగాడు, బిజెపి  తూర్పు దిల్లీ అభ్యర్థి గౌతం గంభీర్‌ చెప్పారు. 

‘ఏసీ గదుల్లో కూర్చొని సమస్యలపై ట్వీట్లు చేయడం తేలికే. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నిజమైన క్రీడా స్ఫూర్తితో నేను క్రికెట్‌ ఆడాను. ఇప్పుడు కూడా అదే తీరుతో రాజకీయాల్లోకి వచ్చాను. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కావాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికల ముందు డిమాండ్ చేస్తోంది’ అని పేర్కొన్నారు; 

‘నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి ఆకర్షితుడిని అయ్యాను. బిజెపి నేతలు, కార్యకర్తల సాయంతో నేను పోటీ చేస్తున్న స్థానం నుంచి గెలుపొందుతాను. నేను అసత్య హామీలు ఇవ్వను. ఈ నియోజక వర్గంలో గెలుపొందితే ఐదేళ్ల తర్వాత నా గురించి ప్రజలు ఏమని మాట్లాడుకోవాలన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాను. తూర్పు దిల్లీ సిట్టింగ్‌ ఎంపీకి టికెట్‌ ఇవ్వకపోవడమనేది భాజపా తీసుకున్న నిర్ణయం. ఈ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు.. ఆయన ఎంపీగా బాగా పనిచేశారు’ అని గంభీర్‌ తెలిపారు. 

తాను‌ పోటీ చేయనున్న తూర్పు దిల్లీ లోక్‌సభ నియోజక వర్గం గురించి గంభీర్‌కు ఏ మాత్రం పరిజ్ఞానం ఉందో తెలుసుకోవడానికి ఓ పాత్రికేయుడు ఆయనకు ఓ ప్రశ్న వేశారు. తూర్పు దిల్లీలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు, మున్సిపల్ వార్డులు ఉన్నాయని అడిగారు. దీనికి గంభీర్‌ వెంటనే స్పందిస్తూ... ‘పది అసెంబ్లీ స్థానాలు, 39 వార్డులు ఉన్నాయి’ అని సమాధానం చెప్పారు.