వారణాసిలో ప్రధాని మోదీ మెగా రోడ్‌ షో

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు. ఇందులో భాగంగా వారణాసిలో గురువారం భారీ రోడ్‌ షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు. బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం గేట్‌ వద్ద ఉన్న పండిత్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ రోడ్ షోలో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరు కిలోమీటర్ల మేర మోదీ రోడ్ షో సాగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర బీజేపీ నేతలు రోడ్‌షోలో పాల్గొన్నారు.

జనం భారీగా తరలి రావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ విషయంలోనూ పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 2014లోనూ మోదీ ఇదే లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో ఆప్‌ అభ్యర్థి అరవింద్‌ కేజ్రీవాల్‌ మీద గెలుపొందారు. 

దశాశ్వమేధ ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన గంగా హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఘాట్ వద్ద పూజారులతో పాటు ఆయన కూడా మంత్రోచ్ఛరణలు చేశారు.

శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, శివసేన అధినేత ఉద్దవ్ థాకరే, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ లతో పాటు పలువురు ఎన్డీయే నేతలు పాల్గొంటారు.