సీఎం, సీఎస్ ల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం

టిడిపి నాయకులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యంల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. సిఎస్‌పై అవినీతి ఆరోపణలతో మొదలైన వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత రెండు, మూడు రోజులుగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సిఎస్‌గా ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం నియామకం అనంతరం ముఖ్యమంత్రి నుండి మంత్రుల వరకూ అందరూ సిఎస్‌పై విమర్శలు చేస్తున్నారు. అవినీతిపరుడని, ఆయనతీరు అనుమానాస్పదంగా ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించగా, ప్రభుత్వ పథకాలపై సమీక్ష చేయడానికి ఆయనెవరని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పథకాలపై అధికారులతో సమీక్ష చేస్తే తప్పేంటని ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం బుధవారం ఘాటుగా జవాబిచ్చారు. వారం రోజులుగా ఒకరిపై ఒకరు పదే పదే విమర్శలు చేసుకుంటుండంతో వ్యవహారం వేడెక్కింది. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పోలవరం, సిఆర్‌డిఏపై సమీక్షలు నిర్వహించడంతో ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోడ్‌ అమల్లో ఉండగా సమీక్షలు ఎలా జరుపుతారని, దానికి అధికారులు ఎలా వెళతారని ప్రశ్నించారు. 

అనంతరం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ఎంసిసి నిబంధనలతో కూడిన పుస్తకాలను అందజేశారు. ఎవరూ నిబంధనలు ఉల్లంఘించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సమీక్షలకు హాజరైన అధికారులకు సిఎస్‌ నోటీసులు ఇచ్చారు. దీంతో అప్పటికే ఉప్పునిప్పుగా ఉన్న వ్యవహారం మరింత బెడిసికొట్టింది. సిఎస్‌ కూడా ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలకు వెళతారని ప్రచారం జరిగింది. ఆయన వెళ్లకపోవడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పైగా రోజువారీ ప్రభుత్వం చేయాల్సిన పనులపై సిఎస్‌ నేరుగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిధుల విడుదలకు ఆదేశాలు ఇస్తున్నారు. సంక్షేమ పథకాల నిధుల విషయంపై ఇటీవల ఆర్థికశాఖ అధికారులతో చర్చించిన సమయంలో నిధుల విడుదలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై ఆర్థికమంత్రి యనమల మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు నిధుల విషయంలో ప్రశ్నించడానికి ఆయనెవరని, క్యాబినెట్‌ నిర్ణయించిన తరువాత వాటిని అమలు చేయాల్సిందేనని, నిబంధనల ప్రకారం నిధులు విడుదల చేయాలని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పథకాలపై చర్చించే అధికారం ఉందని, లేదని ఎవరైనా చెప్పగలరా అంటూ మరోవంక సీఎస్ ప్రశ్నించారు. దీంతో వ్యవహారం చర్చనీయాంశం అయింది. ఇది ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా అధికారులెవరూ సిఎం రివ్యూలకు వెళ్లకూడదని చేసిన ప్రకటనతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం గుర్రుగా ఉంది. అటు సిఎస్‌, ఇటు ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి వ్యాఖ్యలతో వివిధ సంక్షేమ రంగాలు చూస్తున్న ఉన్నతాధికారులూ ఆలోచనలో పడ్డారు.

ఈ నేపథ్యంలో సిఎస్‌పై విమర్శలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ఐఎఎస్‌ అధికారుల సంఘ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీనియర్‌ అధికారులు ఎక్కువమంది హాజరయ్యారు. ఇది కూడా రాజకీయంగా వేడెక్కించే అంశం కావడంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తెగే పరిస్థితి కనిపించడం లేదు.