ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ మొక్కుబడి చర్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పరిపాలనను గాలికి వదిలి వేయడంతో ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో అనడానికి ఇంటర్ ఫలితాలు రాగానే దేశంలో ఇప్పటి వరకు మరెక్కడా లేని విధంగా వరుసగా 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో వెల్లడైనది. వారితో అత్యధికులు మంచి మార్కులు ఆశించి భంగపడిన వారే. అందుకు పరీక్షా పేర్పార్లు దిద్దడంలో ఇంటర్మీడియట్ బోర్డు తీవ్ర నేరమయ నిర్లక్ష్య ధోరణిని అనుసరించడమే.

మూడొంతుల మందికి పైగా విద్యార్థులు తప్పడం, మంచి ర్యాంకులు వస్తాయని ఆశించిన వారు కూడా వారిలో ఉండడంతో ఇంటర్మీడియట్ బోర్డు ఎంతగా కుళ్ళి పోయినదో వెల్లడైనది. వెంటనే కేసీఆర్ మేల్కొని ఉంటె కనీసం 15 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడి ఉండేవారని భావిస్తున్నారు. ఇప్పుడైనా మొక్కుబడి చర్యలతో పరిస్థితుల తీవ్రతను తాగించే ప్రయత్నం చేయడమే గాని ఇంతమంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన విద్యాశాఖ అధికారులను, గ్లోబరీనా సంస్థను కాపాడేలా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. 

జరుగవలసిన నష్టం అంత జరిగిన తర్వాత, ప్రజలలో పెబుల్లికిన ఆగ్రహం శాంతిభద్రతల సమస్యగా మారుతుండగా, ఇంటర్మీడియట్ బోర్డు పరిసరాలలో కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొనడంతో నష్ట నివారణ చర్యగా కేసీఆర్ అడుగు పెట్టారు. పైగా హై కోర్ట్ మొట్టికాయలు వేసింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వాల్యూయేషన్‌, రీ కౌంటింగ్‌ చేయాలని ఇంటర్‌ బోర్డు అధికారులను ఆదేశించారు. పాసైన విద్యార్థులు కూడా రీ వాల్యూయేషన్‌, రీ కౌంటింగ్‌ కోరుకుంటే పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని సూచించారు.

ఇక పరీక్షల నిర్వహణకు ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయడం గురించి కసరత్తు చేయమని ఆదేశించారు. అంతేగాని జరిగిన ఘోరమైన నష్టానికి బాధ్యులను గుర్తించే ప్రయత్నం మాత్రం చేయక పోవడం గమనార్హం. విద్యార్థుల డాటా ప్రాసెస్‌, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్‌ సోర్సింగ్‌ ఏజన్సీల ఎంపికలో ఎటువంటి  అనుభవం,  అర్హత లేని సంస్థను ఎంపిక చేసిన వారిపై క్రిమినల్ చర్య తీసుకొనే సాహసం ఉందా ?

విద్యార్థులెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పడానికి కేసీఆర్ కు నాలుగు రోజులు పట్టిందా ? అన్యాయం జరిగినదని బోర్డు కార్యాలయంపై వెళ్లిన విద్యార్థులు, తల్లితండ్రులపైకి పోలీసులను ప్రయోగించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తక్షణం చర్య తీసుకొనే ప్రయత్నం కూడా చేయనే లేదు. లోతైన దర్యాప్తుకు ఆదేశించే ఆలోచన కూడా చేయలేదు. అట్లా చేస్తే తీవ్రమైన మూల్యం  చెల్లించుకోవలసి వస్తుందని ఆయనకు తెలుసు.