బిజెపి మెజారిటీ సాధించించడం తధ్యం

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కులవాదంపై జాతీయవాదం పైచేయి సాధించిందని, ఫలితంగా బిజెపి మెజారిటీ సాధించి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ భరోసా వ్యక్తం చేశారు. అమర్ సింగ్ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వంపైనా విరుచుకుపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రెండు నాల్కల ధోరణి అనుసరించారని, తనను మోసం చేశారని కూడా  ఆరోపించారు.

‘ఈసారి కులవాదంపై జాతీయవాదం పైచేయి సాధించింది. పరిస్థితి నరేంద్ర మోదీకి అనుకూలంగా మారిపోయింది. అందువల్ల బీజేపీ స్వంతంగా మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది’ అని అమర్ సింగ్ చెప్పారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల మధ్య వ్యత్యాసాన్ని ఆయన వివరిస్తూ, 2014లో ‘నమో’ హవా వీచిందని, ఈసారి ప్రజలు ఈ అయిదేళ్లలో నరేంద్ర మోదీ చేసిన బ్రహ్మాండమయిన పనిని చూసి ఆయనకు ఓటు వేస్తారని అమర్ సింగ్ పేర్కొన్నారు.

‘వైద్య చికిత్స మొదలుకొని ఎల్‌పీజీ సిలిండర్లు, విద్యుత్, గృహనిర్మాణం వరకు బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలలో బాగా పనిచేసి, సామాన్య ప్రజల జీవితాలను స్పృశించింది’ అని ఆయన వివరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా అమర్ సింగ్ ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొనలేక పోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పీ-బీఎస్‌పీ పొత్తు గురించి, దాని ప్రభావం గురించి ప్రశ్నించగా, ‘మాయావతి (బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి) సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులకు క్రమశిక్షణ గురించి బోధిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా సమాజ్‌వాదీ పార్టీ పతనాన్ని ఇది సూచిస్తోంది’ అని ఎద్దేవా చేశారు.

‘ఎస్‌పీ ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలో గతంలో 39 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలో ప్రతి ఎన్నికలోనూ ఈ సీట్లు తగ్గుతూ వస్తున్నాయి’ అని ఆయన గుర్తు చేశానారు. ములాయం సింగ్ యాదవ్ రెండు నాల్కల ధోరణిని అనుసరించారని, విశ్వసించదగిన వ్యక్తి కాదని, తనను, శివపాల్ యాదవ్‌ను మోసగించి, కుమారుడు అఖిలేశ్ యాదవ్ పక్కన చేరారని అమర్ సింగ్ ధ్వజమెత్తారు.

తాను ఎప్పుడూ సమాజ్‌వాదీ పార్టీని వీడలేదని, వారే తనను రెండుసార్లు పార్టీ నుంచి బయటకు పంపించారని ఆయన పేర్కొన్నారు. బీజేపీతో సాన్నిహిత్యం గురించి ప్రశ్నించగా, ‘నేను బీజేపీ సభ్యుడిని కాదు. నేను ప్రచారం కోసం రాంపూర్‌కు వెళ్లింది మోదీ కోసమే తప్ప (అభ్యర్థి) జయప్రద కోసం కాదు’ అని అమర్ సింగ్ బదులిచ్చారు.