ప్రతిపక్షాలకు అధికారం ఇస్తే రోజుకొక్క ప్రధాని !

సరైన నాయకుడు లేనటువంటి ప్రతిపక్షాల కూటమికి దేశప్రజలు అధికారం ఇచ్చినట్లయితే రోజుకొక్కరు ప్రధాన మంత్రిగా ఉండవలసి వస్తుందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరించారు. సోమవారం మమతా బెనర్జీ, మంగళవారం అఖిలేశ్‌ యాదవ్‌, బుధవారం మాయావతి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గురువారం, శుక్రవారం చంద్రబాబునాయుడు, శనివారం దేవెగౌడ ప్రధాన మంత్రులుగా వ్యవహరిస్తారని, ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు తీసుకోవచ్చని ఎద్దేవా చేసారు.

బిహార్‌లోని ముంగేర్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న పాల్గొంటూ ఇదేనా దేశాన్ని నడిపించే విధానం? అంటూ  ప్రతిపక్షాలపై తనదైన శైలిలో దాడికి దిగారు. దాదాపు 55 ఏళ్లు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ కేవలం అధికార దర్పాన్ని చూపించిందే కానీ ప్రజలకు ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. రాహుల్ మాత్రే కాదు, ఆయన తర్వాత మరో గాంధీ వచ్చినా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఆఫ్‌స్పా) రద్దు చేయలేరని స్పష్టం చేశారు.

 'ఆఫ్‌స్పాను రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోంది. అదే జరిగితే ఆర్మీ సిబ్బందిపై కేసులు పెడతారు. ఆఫ్‌స్పాను రద్దు చేయవచ్చా? నేను రాహుల్ బాబాకు ఒకటి చెప్పదలచుకున్నాను. మీ జీవితకాలంలో ఎప్పటికీ ఆ చట్టాన్ని రద్దు చేయలేరు. మీరే కాదు..మీ తర్వాత మరో గాంధీ వచ్చినా ఆ చట్టం రద్దు కాదు' అని అమిత్‌షా స్పష్టం చేశారు.

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకార చర్యగా భారత వాయుసేన బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 400 వందలమందికిపైగా ఉగ్రవాదులు మరణించి ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. భారత వాయుసేన చేసిన ఈ ప్రతీకార దాడిని దేశ ప్రజలంతా అభినందిస్తూ సంబరాలు చేసుకుంటుంటే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాత్రం విచారం వ్యక్తం చేశారంటూ  అమిత్‌షా మండిపడ్డారు.

దేశ భద్రతకు సంబంధించిన ఎలాంటి దాడినైనా ప్రధాని నరేంద్ర మోదీ సమర్థంగా తిప్పికొడతారని.. రాహుల్‌ బాబాలా మౌనంగా ఉండరంటూ విరుచుకుపడ్డారు. వైమానిక దాడులు జరిగిన సమయంలో ఒకవైపు పాకిస్థాన్‌, మరోవైపు రాహుల్‌ గాంధీ, ఆయన బృందం విచారం వ్యక్తం చేశారంటూ ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్‌ హయాంలో పాకిస్థాన్‌ సైన్యం ఒకవైపు, వారి అండతో చెలరేగిపోతున్న ఉగ్రవాదులు సరిహద్దుల్లో నిబంధనలు ఉల్లంఘించి కవ్వింపుచర్యలకు పాల్పడుతూ భారత సైనికులను చంపుతూ చిత్రహింసలకు గురిచేసినా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మౌనంగా ఉన్నారే కానీ ఏమీ చేయలేకపోయారని ధ్వజమెత్తారు. 

‘దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మహా గత్‌బంధన్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి నా మొబైల్‌ ఫోన్‌కు ఒక ఆశ్చర్యకరమైన మెసేజ్‌ వచ్చింది' అంటూ తెలిపారు.

కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీలు కశ్మీర్‌ను ఇండియా నుంచి విడగొట్టాలని చూస్తున్నట్టు అమిత్‌షా ఆరోపించారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలని ఒమర్ చెబుతుంటారని, ఇదే మహాకూటమికి చెందన నేతలు లాలూ, రబ్రీ, రాహుల్ ఈ దేశం నుంచి కశ్మీర్‌ను వేరుచేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దేశానికి మణిమకుటం కశ్మీర్ అని, హిందుస్థాన్‌లో అంతర్భాగమని అమిత్‌షా స్పష్టం చేశారు