ప్రతిపక్షాలకు ఓటమి అంగీకరించడం తప్ప మరో మార్గం లేదు

పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన చిన్నారులు సాకులు చెప్పి తప్పించుకుందామనుకుంటారని, ఇదే విధంగా ప్రతిపక్ష పార్టీలు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై సాకులు చెబుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఝార్ఖండ్‌లోని లోహర్‌దగ్గాలో  ప్రచార సభలో పాల్గొంటూ మూడు దశల పోలింగ్‌ జరిగిన అనంతరం ప్రతిపక్షాలకు ఓటమిని అంగీకరించడం తప్ప మరో మార్గం‌ మిగలలేదని స్పష్టం చేశారు. 

ప్రజలను ఓ విషయం అడగాలనుకుంటున్నానని చెబుతూ ఉగ్రవాదాన్ని అరికట్టగలిగే సమర్థవంతమైన నాయకుడు ఎవరు? మీ ఓటు ద్వారానే అటువంటి నాయకుడిని ఎన్నుకుని ఉగ్రవాదాన్ని అరికట్టవచ్చు అని సూచించారు. మీరు కమలం గుర్తుకు ఓటు వేస్తే దేశం శక్తిమంతమవుతుందని చెప్పారు. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా వారి యోగక్షేమాల గురించి పట్టించుకోవడం నా బాధ్యత. అని భరోసా ఇచ్చారు. 

ఇరాక్‌లో మన దేశానికి చెందిన నర్సులను ఉగ్రవాదులు బంధించినప్పుడు వారిని తిరిగి తీసుకురావడానికి చేయాల్సిన పనులన్నీ చేసి సఫలమయ్యామని ప్రధాని గుర్తు చేశారు.   "కాంగ్రెస్‌ పార్టీకి మన ఆర్మీపై నమ్మకం లేదు.  కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఇదే తీరుతో ఉన్నారు. పేదరికంలో ఉన్నవారే ఆర్మీలో చేరుతున్నారని ఆయన అంటున్నారు. మన భద్రతా బలగాలను వారు ఎందుకు అవమానిస్తున్నారు? " అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ తీరు వల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతోందని ప్రధానిహెచ్చరించారు . 2014కి ముందు దేశంలో ఉగ్రవాద భయం ఉండేదని, దేశంలో ఉగ్రదాడులు జరిగితే కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోయేదని ప్రధాని ధ్వజమెత్తారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకాన్ని అమలు చేయట్లేదని, ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని వారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.