అయోధ్య, ఆదార్ లపై తీర్పు ఇవ్వనున్న దీపక్ మిశ్రా

వచ్చే నెల 2న పదవీ విరమణ చేయనున్న సుప్రేం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ లోగా పలు కీలక అంశాలపై తీర్పు ఇవ్వనున్నారు. దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులపై గణనీయమైన ప్రభావాన్ని చూపే పది కేసుల్లో కీలక తీర్పులు రానున్న కొన్ని రోజుల్లో వెలువడనున్నాయి. ఆయన పదవీకాలం ఇంకా 28 రోజులున్నా, సెలవులను తీసివేస్తే 20 రోజులు మాత్రమె మిగిలి ఉంది. ఈ లోగా ఈ కేసులను తేల్చవలసి ఉంటుంది.

 వీటిలో రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసు, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఆధార్ చట్టబద్ధత, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, స్వలింగ సంపర్కుల హక్కులకు సంబంధించిన సెక్షన్ 377 రద్దు, కేసులు అత్యంత కీలకమైనవి. కీలకమైన ఈ కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి చారిత్రక తీర్పుల్ని ప్రకటిస్తుందోనని సర్వత్ర అసక్తి నెలకొన్నది.

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50ఏండ్ల మధ్య వయస్కులైన మహిళల ప్రవేశాన్ని నిరోధించడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్‌జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్నది. నిర్దిష్ట వయసు మహిళలకు మాత్రమే ప్రవేశాన్ని నిరోధించడం రాజ్యాంగంలోని ఆర్టికల్-17 ద్వారా నిషేధించిన అంటరానితనాన్ని అమలు చేయడమే అవుతుందని పిటిషన్‌దారులు అభిప్రాయపడుతున్నారు. 41రోజులపాటు పవిత్రంగా మహిళలు ఉండడానికి అవకాశం లేనందువల్లే(రుతుస్రావం కారణంగా), వారి ప్రవేశాన్ని నిషేధించినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వాదిస్తున్నది.

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థలవివాద కేసుపై చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపుతున్నది. అయోధ్యలోని వివాదాస్పద 2.7 ఎకరాల స్థలాన్ని గతంలో సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు 2:1 మెజారిటీతో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన 13 పిటిషన్లపై విచారణ జరిపేందుకు గత ఏడాది జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. ఈ ఏడాది మార్చి14 నుంచి ధర్మాసనం ఈ కేసు విచారణను ప్రారంభించింది.

అయోధ్య కేసును భూవివాదంగా మాత్రమే పరిగణించి విచారణ జరుపుతున్నట్లు ధర్మాసనం ఇప్పటికే స్పష్టంచేసింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అయోధ్య తీర్పు బీజేపీకి అత్యంత కీలకం. సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించే నిర్ణయం దేశ రాజకీయాలపై విశేష ప్రభావాన్ని చూపనుంది. అయోధ్య కేసులో తుది తీర్పునకు ముందు.. ఇస్లాంలో మసీదు అనేది ఓ ముఖ్యమైన భాగమా? అనేది తేల్చేందుకు మరో కేసును విస్తృత ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా అప్పగించే అవకాశముంది.

సీజేఐ ముందున్న కేసుల్లో ఆదార్ అత్యంత కీలకమైనది. ఆధార్ సంఖ్యను అన్ని ప్రభుత్వ పథకాలకు, గుర్తింపు ప్రక్రియలకు తప్పనిసరి చేయడంపై జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలో తొమ్మిదిమంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నాలుగు నెలలపాటు విచారణ జరిపింది. పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కును ఆధార్ హరిస్తున్నదని, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అది శాపంగా మారిందని పేర్కొంటూ సర్వోన్నత న్యాయస్థానం వద్ద అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.

210 కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఆధార్ ద్వారా సేకరించిన పౌరుల వ్యక్తిగత సమాచారం బహిరంగంగానే అందుబాటులో ఉందని, ఆధార్ అనుసంధాన నిబంధన వల్ల కీడు తప్ప మేలేమీ లేదని పలు ఎన్జీవోలు, పౌరసమాజం వాదిస్తున్నది. ఆధార్‌ను తప్పనిసరి చేయడం అంటే, దేశాన్ని నిఘారాజ్యంగా మార్చడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉన్నది. ఆధార్ సమాచారం భద్రమైనదని, పౌరస్వేచ్ఛకు ఆధార్ అనుసంధానం ప్రతిబంధకం కాదని సర్కార్ వాదిస్తున్నది. వ్యక్తిగత గోప్యతను రాజ్యాంగ హక్కుగా పరిగణించాలా లేదా అనేదానిపై ఈ నెలలో తీర్పు వెలువడవచ్చు.

వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలన్న చట్టానికి రాజ్యాంగ పరమైన చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన కేసుపై తుది తీర్పును సుప్రీంకోర్టు వెలువరించాల్సి ఉంది. ఒక వ్యక్తి అవతలి వ్యక్తి అనుమతిలేకుండా అతని భార్యతో లైంగికచర్యలో పాల్గొంటే సదరు పురుషుడిని నిందితుడిగా, మహిళలను బాధితురాలిగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 497ను మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మార్చాలని దాఖలైన పిటిషన్‌పై సీజేఐ నేతృత్వంలో విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. మహిళను కేవలం పురుషుడి ఆస్తిగానే చూసే సెక్షన్ 497ను మార్చాలని పిటిషనర్లు కోరుతున్నారు. ఇలాంటి చట్టాల్లో లింగ వివక్షకు తావు ఉండరాదన్న అంశాన్నీ ధర్మాసనం పరిశీలిస్తున్నది.

స్వలింగ సంపర్కుల లైంగిక ప్రాధామ్యాలను పరిరక్షించేందుకు భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 377ను రద్దు చేయాలని కోరుతూ 20మంది ఐఐటీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పైనా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్నది. స్వజాతి లైంగిక కార్యకలాపాలు నేరంగా పరిగణించే సెక్షన్ 377ను రద్దు చేయాలని వారు పోరాడుతున్నారు.