తలసానిపై దేశ ద్రోహ చట్టం కింద కేసు పెట్టాలి

 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై దేశద్రోహ చట్టం కింద కేసు నమోదు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ , హైదరాబాద్ నగర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు డిమాండ్ చేశారు.  సైనికుడు అభినందన్ ను విడిచి పెట్టాలని పాకిస్థాన్ ను ప్రధానమంత్రి మోదీ హెచ్చరించడాన్ని తప్పుపట్టిన తలసాని దేశద్రోహే అని స్పష్టం చేశారు. 

ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఉన్న వ్యక్తి  పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడడం తీవ్రమైన చర్యగా భావించి శాసనసభ్యులుగా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాకిష్థాన్ ను  హెచ్చరించడాన్ని ఎలా తప్పుపడతారని ఆయన నిలదీశారు. ఆత్మస్థైర్యంతో దేశ ప్రజలు ప్రపంచ దేశాల ముందు సగర్వంగా ఉండే విధంగా కేంద్రం పాకిస్తాన్ హెచ్చరించడమే కాకుండా తగిన బుద్ధి చెప్పిందని, ఈ విషయాన్ని టీఆర్‌ఎస్ నేతలు మర్చిపోరాని హితవు చెప్పారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ముందస్తుగా ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సాధ్యమైందని పేర్కొన్నారు. జాతి వ్యతిరేక విధానాలు, విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం అన్నింట్లో వైఫల్యం చెందడంతో మతవిద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా విషయం పక్కదారి పట్టించాలని అనుకోవడం సరికాదని హితవు చెప్పారు. ఈ వ్యాఖ్యల వెనుక టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రోత్సహించినట్టుగా ఉందని తేలిపారు.

ఇంటర్ పరీక్షా ఫలితాలలో జరిగిన అవకతవకలకు అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేతకు సంబంధాలున్నాయని అందుకే జరిగిన తప్పిదాలపై సిబ్బంది పైన గాని, అధికారుల పైన గాని చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.