చంద్రబాబు ఈవీఎం లను మేనేజ్ చేశారా !

ఎన్నికల నిర్వహణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల కమిషన్‌ అన్ని విధాలుగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ‘రాష్ట్రంలో పోలింగ్‌ ముగిశాక కొన్నిచోట్ల ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంలకు ఆలస్యంగా చేరాయి. కొందరేమో ఎన్నికల విధుల్లో అలసిపోయి ఆలస్యంగా తీసుకొచ్చామన్నారు. మరికొన్ని చోట్ల బస్సులు అడ్డుపెట్టడంవల్ల వాటిని సకాలంలో చేర్చలేకపోయామని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే సీఎం చంద్రబాబే ఈవీఎంల ట్యాంపరింగ్‌కు ఏమైనా పాల్పడ్డారా? అనే అనుమానాలున్నాయి’ అని పేర్కొన్నారు. 

ఈవీఎంలు ఎక్కువ సంఖ్యలో మరమ్మతులకు రావడం, అర్ధరాత్రి వరకు పోలింగ్‌లు, మరుసటి రోజు మధ్యాహ్నానికి ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరడం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు.

‘సీఎం చంద్రబాబు కొంతమంది కలెక్టర్ల ద్వారా ఈవీఎంలను మేనేజ్‌ చేశారన్న అనుమానాలు మాకు ఇప్పుడు కలుగుతుని చెప్పారు. దేశంలో ఎక్కడా ఈవీఎంలు ఇంత ఆలస్యంగా చేరిన దాఖలాలు లేవని, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకిలా జరిగిందో సమీక్షించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ తరఫున త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. 

"మాకు ఈవీఎంలపై నమ్మకం ఉంది కానీ చంద్రబాబు మీద లేదు. ముఖ్యమంత్రి తీరు గతంలోనూ, ఇప్పుడూ దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే సమీక్ష జరపాలి" అని కన్నా డిమాండ్ చేశారు. కొన్ని జిల్లాల్లో తనకు సంబంధించిన కలెక్టర్లను పెట్టుకుని ముఖ్యమంత్రి ఈవీఎం యంత్రాల మార్పిడికి, అవతవకలకు పాల్పడి తిరిగి ఎదుటి వారిపై నిందారోపణలు చేస్తున్నారని ఆరోపించారు. 

ఎన్నికలకు ఒకరోజు ముందే మద్యం పంపిణీకి వీలుగా చెక్‌ పోస్టులను తొలగించడం ఎన్నడూ చూడలేదని అంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వ్యవస్థ సీఎం కనుసన్నల్లో నడిచిందని ఆరోపించారు. తాము ఫిర్యాదు చేసినా సీఈవో కనీసం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తాజాగా ఎంపీ దివాకర్‌రెడ్డి రూ.50కోట్లు ఖర్చు పెట్టానని చేసిన వ్యాఖ్యలపైనా ఈసీచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్ర విభజనను సోనియాగాంధీ ఎంతో న్యాయంగా చేశారంటూ రాయచూర్‌లో సీఎం చంద్రబాబు అన్నట్లుగా ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన వార్తను కన్నా ఈ సందర్భంగా చూపించారు. ‘ఐదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ, సోనియాగాంధీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని గొంతు చించుకొని, ఇప్పుడు న్యాయం చేశారని చెప్పడం ముఖ్యమంత్రి అవకాశవాదానికి నిదర్శనం. తన కింద పని చేసే ఓ అధికారి తనకు వ్యతిరేకి అని చెప్పడం సీఎం పాలనకే అవమానం’ అని కన్నా విమర్శించారు.