పీఎం పోస్టుకు వేలం పెడితే దీదీ, కాంగ్రెస్ పోటీ

ప్రధాన మంత్రి పోస్టుకు వేలం పెడితే దీదీ (మమతా బెనర్జీ), కాంగ్రెస్ (రాహుల్ గాంధీ) పోటీపడతారంటూ, అవినీతిలో ఇద్దరూ ఇద్దరేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్‌లోని అసాన్‌సాల్‍లో మంగళవారం జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ అవినీతిలో రికార్డు సృష్టించిందని, ఇవాళ టీఎంసీ ప్రభుత్వం ఆ రికార్డులో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోందని ధ్వజమెత్తారు. . టీఎంసీ హయాంలో అవినీతి, నేరాలు అప్రతిహతంగా సాగుతున్నాయ ని ఆరోపించారు. స్పీడ్ బ్రేకర్ దీదీ పాత్ర కూడా అందులో ఉందని దయ్యపట్టారు.

బంగ్లాదేశ్ నటులను ఎన్నికల ప్రచారానికి టీఎంసీ వాడుకోవడంపై మరోసారి ప్రధాని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారానికి సరైన వాళ్లెవరూ రాకపోవడంతో విదేశాల్లోని నటులను బలవంతంగా తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎందరో ధీమంతులకు పెట్టింది పేరైన బెంగాల్‌కు అటువంటి వాళ్లను తీసుకురావడం చూస్తే దీదీపై జాలి కలుగుతుతోందని చెప్పారు.

'గణనీయంగా సీట్లు సాధించి ప్రధాని పదవిని కైవసం చేసుకోవాలని దీదీ అనుకుంటున్నారు. ఒకవేళ పీఎం పదవి వేలానికి వస్తే, తాము దోచుకున్న సంపదనంతా కూడదీసుకుని ఆ పదవి కోసం దీదీ, కాంగ్రెస్ పోటీ పడతారు' అని మోదీ ఎద్దేవా చేశారు. అయితే ప్రధాని పదవి కొనుగోలుకు లేదంటూ ఆయన చమత్కరించారు.