48శాతం మంది ప్రజల మద్దతు మోదికే

దేశానికి నేతృత్వం వహించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే మెరుగైన నేత అని ఒక ఆన్‌లైన్‌ అధ్యయనంలో వెల్లడయింది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది,  48 శాతం మంది మోదీ వైపే మొగ్గు చూపారు. ఆయనకు సమీపంలో మరే నాయకుడు లేరు.

రాజకీయ పార్టీలకు వ్యూహాల్లో సలహాదారు సేవలందించే ప్రశాంత్‌కిషోర్‌కు చెందిన ఐ-పాక్ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? ఈ సమస్యలను పరిష్కరించేందుకు దేశానికి నేతృత్వం వహించగల నేత ఎవరు అనే అంశాలతో నేషనల్‌ అజెండా ఫోరం పేరుతో ఈ సంస్థ అధ్యయనం నిర్వహించింది.

ఈ అధ్యయనంలో 712 జిల్లాల్లో, 55 రోజుల పాటు 57లక్షల మందిని కలసి అభిపాయలు సేకరించగా వారిలో 48 శాతం మంది మోదీకి అనుకూలంగా ఓటు వేశారు.  మొత్తం 923 మంది నాయకుల పేర్లు ఇచ్చి వారిలో ఎంపిక చెఉస్కొమని కోరారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 11.2 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ 9.3శాతం మంది మద్దతుతో మూడో స్థానంలో, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత అఖిలేశ్‌ యాదవ్‌ ఏడుశాతం మంది మద్దతుతో నాలుగోస్థానంలో నిలిచారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 4.2శాతం మంది మద్దతుతో ఐదో స్థానంలో, బహుజన్‌సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతి 3.1శాతం మంది మద్దతుతో ఆరోస్థానంలో నిలిచారు.

కాగా, మహిళా సాధికారికత, వ్యవసాయ సంక్షోభం, ఆర్ధిక అసమానత, విద్యార్ధుల సమస్యలు, ఆరోగ్యం-పారిశుధ్యంపై చైతన్యం, మత సమైక్యత, ప్రాధమిక విద్య వంటి అంశాలను అత్యధిక ప్రాధాన్యత అంశాలుగా పేర్కొన్నారు.

ఇట్లా ఉండగా రాజకీయాలలో ఉండదగిన ప్రముఖ వ్యక్తుల జాబితాలో అక్షయ్ కుమార్, రఘురామ్ రాజన్, ఏం ఎస్ ధోని, బాబా రామదేవ్, జర్నలిస్ట్ రవీష్ కుమార్ పేర్లను ఎంచుకున్నారు.